ICC ODI World Cup 2027: ఛీ.. ఇదేం వరల్డ్ కప్ ఫార్మాట్! ఐసీసీపై కెప్టెన్ల మండిపాటు

2027 వన్డే ప్రపంచకప్ కొత్త ఫార్మాట్‌పై అసోసియేట్ దేశాల కెప్టెన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త అర్హత విధానం చిన్న జట్లకు అవకాశాలు తగ్గిస్తోందని, ప్రపంచ క్రికెట్ అభివృద్ధికి ఇది ప్రతికూలమని విమర్శించారు. కీలక నిర్ణయాల్లో ఆటగాళ్లతో సంప్రదింపులు జరపాలని ఐసీసీని కోరారు.

ICC ODI World Cup 2027: ఛీ.. ఇదేం వరల్డ్ కప్ ఫార్మాట్! ఐసీసీపై కెప్టెన్ల మండిపాటు
Icc Odi World Cup 2027

Updated on: Jul 18, 2026 | 5:13 PM

2027 వన్డే వరల్డ్ కప్ కోసం ప్రకటించిన కొత్త ఫార్మాట్‌పై అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అసోసియేట్ దేశాల కెప్టెన్లు, పలువురు అంతర్జాతీయ ఆటగాళ్లు ఈ ఫార్మాట్ చిన్న జట్ల అవకాశాలను గణనీయంగా తగ్గిస్తోందని ఆరోపిస్తున్నారు. ప్రపంచ క్రికెటర్ల సంఘం (WCA) ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించిన వారు, ప్రపంచ క్రికెట్ అభివృద్ధి లక్ష్యాలకు ఈ నిర్ణయం విరుద్ధమని పేర్కొన్నారు. ఐసీసీ ఆమోదించిన కొత్త ఫార్మాట్ ప్రకారం.. అర్హత సాధించిన జట్లలో అత్యల్ప ర్యాంకులో ఉన్న మూడు జట్లు ముందుగా ప్రత్యేక సూపర్ సిరీస్ ఆడాల్సి ఉంటుంది. ఆ సిరీస్‌లో విజేతగా నిలిచిన ఒకే ఒక్క జట్టుకు మాత్రమే ప్రధాన 12 జట్ల ప్రపంచకప్‌లో స్థానం లభిస్తుంది. అనంతరం టోర్నమెంట్ సూపర్-7 దశలోకి ప్రవేశిస్తుంది. ఈ మార్పు వల్ల అసోసియేట్ దేశాలకు ప్రపంచకప్‌లో పోటీ పడే అవకాశాలు మరింత కష్టతరమవుతాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ ఈ నిర్ణయాన్ని అత్యంత నిరాశపరిచేదిగా అభివర్ణించారు. ఒక దేశం ప్రపంచకప్‌కు అర్హత సాధించడానికి సంవత్సరాల పాటు ప్రణాళిక, పెట్టుబడి, కృషి చేస్తుందని, చివరకు అవకాశాలను తగ్గించే విధంగా నిబంధనలు మార్చడం సరైంది కాదన్నారు. ప్రపంచ క్రికెట్‌ను విస్తరించాలని ఐసీసీ చెబుతుంటే, చిన్న దేశాలకు ప్రపంచ వేదికపై అవకాశాలను తగ్గించడం ఆ లక్ష్యానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. ప్రపంచ క్రికెట్ నిజంగా అభివృద్ధి చెందాలంటే అవకాశాలు తగ్గించడం కాకుండా పెంచాలని ఆయన స్పష్టం చేశారు.

నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ మాట్లాడుతూ.. అసోసియేట్ దేశాల ఆటగాళ్లకు వన్డే ప్రపంచకప్ అనేది కేవలం ఒక టోర్నమెంట్ కాదని, వారి కెరీర్‌లకు కేంద్రబిందువని అన్నారు. అత్యున్నత స్థాయిలో పోటీ పడే అవకాశం లభిస్తేనే చిన్న దేశాల్లో క్రికెట్ మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ కూడా అసోసియేట్ దేశాలు ప్రపంచ స్థాయి టోర్నమెంట్లకు ప్రత్యేక ఆకర్షణ తీసుకొస్తాయని అన్నారు. ఇటీవల జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో చిన్న దేశాలు సృష్టించిన సంచలనాలను ఉదాహరణగా చూపిస్తూ, క్రికెట్ కూడా అలాంటి అవకాశాలను విస్తరించాలని సూచించారు.

స్కాట్లాండ్ కెప్టెన్ రిచీ బెరింగ్టన్ కీలక నిర్ణయాల్లో ఆటగాళ్ల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఐసీసీని కోరారు. ఆటగాళ్ల కెరీర్‌లపై ప్రభావం చూపే నిర్ణయాల విషయంలో వారితో అర్థవంతమైన చర్చలు జరపడం అవసరమని, విభిన్న అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటే మెరుగైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అమెరికా ఆటగాడు హర్మీత్ సింగ్ మాట్లాడుతూ.. ప్రపంచకప్ అవకాశాలు కేవలం ఆటగాళ్లకే కాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో క్రికెట్ విస్తరణకు కూడా ఎంతో కీలకమని తెలిపారు. అలాంటి అవకాశాల కోసం దేశాలు, ఆటగాళ్లు ఎన్నో సంవత్సరాలు కష్టపడతారని, వాటిని పరిమితం చేయడం క్రీడాభివృద్ధిపై ప్రభావం చూపుతుందని అన్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us