ఏంది మావా ఈ రికార్డు.. 77 బాల్స్ ఆడి డకౌట్ అయ్యాడు!

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ జియోఫ్ అలాట్ టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డు సృష్టించాడు. 1999లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 77 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయలేదు. ఏకంగా 101 నిమిషాలు క్రీజులో గడిపాడు. పరుగుల ఖాతా తెరవకుండానే ఇంతసేపు బ్యాటింగ్ చేసిన అరుదైన ఆటగాడిగా అలాట్ చరిత్రలో నిలిచిపోయాడు.

ఏంది మావా ఈ రికార్డు.. 77 బాల్స్ ఆడి డకౌట్ అయ్యాడు!
Geoff Allott's 77 Ball Duck

Updated on: Aug 22, 2026 | 3:26 PM

క్రికెట్‌లో బ్యాటర్ సెంచరీ చేస్తే రికార్డు.. డబుల్ సెంచరీ చేస్తే మరింత ప్రత్యేకం. నార్మల్‌గా బ్యాటర్లు బ్యాటింగ్‌కి వచ్చి రన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. బ్యాటర్లే కాదు.. బౌలర్లు సైతం తమ టైమ్ వచ్చినప్పుడు బ్యాట్‌తో సత్తా చాటాలని భావిస్తారు. మన హైదరాబాదీ హీరో, డీఎస్పీ సాబ్ మొహమ్మద్ సిరాజ్ సైతం సూపర్ సిక్సులతో అల్లాడిస్తున్నాడు. అయితే ఓ బ్యాటర్ మాత్రం ఏకంగా 12.5 ఓవర్లు అంటే 77 బంతులు ఆడి ఒక్కటంటే ఒక్క పరుగు కూడా చేయలేదు. ఇది మామూలు రికార్డ్ కాదు. ప్రపంచంలో ఎవరూ కలలో కూడా ఊహించని రికార్డ్. అన్ని బంతులు ఆడి చివరికి డకౌట్ అయ్యాడు. ఇంతకీ ఆ బ్యాటర్ ఎవరు? ఎందుకు అలా ఆడాడు? ఏ మ్యాచ్‌లో ఇది జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో 1999 మార్చి 2న జరిగిన తొలి టెస్టులో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికా తొలుత భారీ స్కోరు సాధించింది. డారిల్ కలినన్ అద్భుతమైన డబుల్ సెంచరీతో 275 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 621/5 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. అయితే న్యూజిలాండ్ తరఫున పదకొండో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అలాట్‌కు పరుగులు చేయడం కంటే వికెట్ కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా మారింది. అతడు దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ 77 బంతులు ఆడాడు. అయితే ఒక్క బంతినీ బౌండరీకి తరలించలేకపోయాడు. చివరకు లాన్స్ క్లూసెనర్ బౌలింగ్‌లో షాన్ పొలాక్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. అధికారిక స్కోర్‌కార్డులో అతడి గణాంకాలు 0 పరుగులు, 77 బంతులు, 101 నిమిషాలుగా నమోదయ్యాయి.

ఇది సాధారణ డక్ కాదు. టెస్ట్ క్రికెట్‌లో ఒక్క పరుగు కూడా చేయకుండా అత్యధిక బంతులు ఎదుర్కొన్న బ్యాటర్‌గా అలాట్ రికార్డు సృష్టించాడు. అయితే అతడి 101 నిమిషాల రికార్డు తర్వాత 2013లో ఇంగ్లండ్‌కు చెందిన స్టువర్ట్ బ్రాడ్ అధిగమించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఈడెన్ పార్క్ టెస్టులో బ్రాడ్ 103 నిమిషాల పాటు పరుగుల ఖాతా తెరవకుండా క్రీజులో ఉన్నాడు. అయినప్పటికీ, అలాట్ ఎదుర్కొన్న 77 బంతుల రికార్డు ప్రత్యేక గుర్తింపును కొనసాగిస్తోంది.

ఆ మ్యాచ్‌లో అలాట్ ఆ ‘డక్’ న్యూజిలాండ్‌కు ఎంతో కీలకంగా మారింది. అతడు క్రీజులో నిలిచి సమయాన్ని గడపడంతో న్యూజిలాండ్ ఫాలోఆన్‌ను తప్పించుకునే పోరాటంలో విలువైన సహకారం అందించాడు. అందుకే క్రికెట్ అభిమానులు అతడి ఇన్నింగ్స్‌ను కేవలం సున్నా పరుగుల స్కోర్‌గా కాకుండా, వికెట్‌ను కాపాడేందుకు చేసిన అసాధారణ పోరాటంగా గుర్తుంచుకుంటారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us