
Gavaskar vs Ashwin: టీ20 ప్రపంచకప్‌పై దృష్టి పెడుతూ వైట్‌బాల్ క్రికెట్‌లో భారత క్రికెట్ జట్టు పురోగమిస్తున్నప్పటికీ, రెడ్‌బాల్ (టెస్ట్) క్రికెట్‌లో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సౌతాఫ్రికాతో జరిగిన సొంతగడ్డపై టెస్ట్ సిరీస్‌లో భారత్ 0-2తో ఓటమి పాలు కావడంతో, జట్టు ఎంపిక, సీనియర్ల రిటైర్మెంట్ అంశంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అయిన సీనియర్ ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులో కొనసాగి ఉంటే యువ ఆటగాళ్లకు సహాయం చేసేవారని అశ్విన్ అభిప్రాయపడ్డారు. అయితే భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రం ఈ సిద్ధాంతాన్ని పూర్తిగా తోసిపుచ్చారు.
టెస్ట్ ఫార్మాట్ నుంచి సీనియర్ ఆటగాళ్లు నిష్క్రమించడానికి సరైన క్లారిటీ లేకపోవడమే కారణమని రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ మధ్యలో అశ్విన్ రిటైర్ అయిన సంగతి తెలిసిందే.
రోహిత్, కోహ్లీ జట్టులో ఉండి ఉంటే సౌతాఫ్రికాపై టెస్ట్ సిరీస్ ఫలితం వేరేలా ఉండేదని చాలా మంది అభిమానులు భావిస్తున్నారు. అయితే, భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రం ఈ వాదనను అంగీకరించలేదు. ఆటగాళ్ల రిటైర్మెంట్ నిర్ణయాలు వారి సొంతమని, జట్టు యాజమాన్యాన్ని నిందించడం సరికాదని ఆయన అన్నారు.
“రిటైర్మెంట్ నిర్ణయం వారి (కోహ్లీ, రోహిత్, అశ్విన్)దే అయి ఉండాలి. బహుశా, వారి భవిష్యత్తు గురించి ఆలోచించుకోమని అడిగి ఉండవచ్చు. కానీ వారు ఉంటే మనం గెలిచే వాళ్లమని చెప్పడం సరికాదు” అని గవాస్కర్ వ్యాఖ్యానించారు.
ఈ ముగ్గురు ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పుడే భారత్ న్యూజిలాండ్‌పై 0-3 తేడాతో ఓడిపోయిందని, అలాగే ఆస్ట్రేలియాలో ఓడిపోయిందని గవాస్కర్ గుర్తు చేశారు. “వారు ఉన్నప్పుడు ఏమైంది? మనం 0-3తో ఓడిపోయాం కదా? ఆస్ట్రేలియాలో ఏం జరిగింది? వారు ఇక్కడ ఉంటే సౌతాఫ్రికాపై ఖచ్చితంగా గెలిచే వాళ్లమని మనం అనుకోకూడదు” అని ఆయన అన్నారు.
అశ్విన్ ఇప్పటికే మూడు ఫార్మాట్ల నుంచి వైదొలగగా, రోహిత్, కోహ్లీని కూడా వన్డే క్రికెట్ నుంచి తప్పించే అంశంపై కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో వచ్చిన ఓటమి ఫలితం కారణంగా, ఈ సీనియర్లను తొందరపాటుతో తొలగించాలనే డిమాండ్లు కాస్త తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..