నాకు, మిగతా వాళ్లకు అదే తేడా..! కుండబద్దలు కొట్టిన గంభీర్

భారత క్రికెట్‌ హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ర్యాంకింగ్స్‌, సోషల్‌ మీడియా లైక్స్‌, వ్యూస్‌ తనకు ముఖ్యం కాదని, ట్రోఫీలు గెలవడమే తన పని అని స్పష్టం చేశారు. భారత్‌ ప్రస్తుతం పరివర్తన దశలో ఉందని, యువ ఆటగాళ్లకు సమయం ఇవ్వాలని అన్నారు.

నాకు, మిగతా వాళ్లకు అదే తేడా..! కుండబద్దలు కొట్టిన గంభీర్
Gautam Gambhir

Updated on: Aug 24, 2026 | 10:59 AM

భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ మరోసారి తనపై వస్తున్న విమర్శలపై వెరైటీగా స్పందించారు. జట్టు ర్యాంకింగ్స్‌, సోషల్‌ మీడియా లైక్స్‌, వ్యూస్‌, విమర్శలు తనకు పెద్దగా పట్టవని స్పష్టం చేశారు. తన పని ఒక్కటేనని.. భారత జట్టుకు ట్రోఫీలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని తేల్చి చెప్పారు. శ్రీలంకతో కొలంబోలో జరగనున్న రెండో టెస్టుకు ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

‘నా పని ట్రోఫీలు గెలవడం’

మీడియా సమావేశంలో గంభీర్‌ మాట్లాడుతూ.. ‘‘ట్రోఫీలు గెలవడమే నా పని. నేను నమ్మేది అదొక్కటే. వీక్షణలు, లైక్స్‌ గురించి నేను పట్టించుకోను. నాకు, మిగతా వారికి అదే తేడా’’ అని స్పష్టం చేశారు. ఇటీవలి టెస్టు ఫలితాల నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలు, సోషల్‌ మీడియాలో జరుగుతున్న చర్చలను పట్టించుకోకుండా జట్టు భవిష్యత్తుపైనే దృష్టి పెట్టినట్లు ఆయన చెప్పుకొచ్చారు. భారత టెస్టు జట్టు ప్రస్తుతం కీలకమైన పరివర్తన దశలో ఉందని గంభీర్‌ అన్నారు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, రవిచంద్రన్‌ అశ్విన్‌ వంటి సీనియర్‌ ఆటగాళ్లు టెస్టు క్రికెట్‌కు దూరమైన తర్వాత కొత్త ఆటగాళ్లతో జట్టును నిర్మించే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. ఇలాంటి సమయంలో ఒకటి రెండు మ్యాచ్‌ల ఫలితాలను ఆధారంగా చేసుకుని ఆటగాళ్లను లేదా జట్టును అంచనా వేయడం సరికాదన్నారు.

యంగ్ ప్లేయర్లపై నమ్మకం

కొత్త భారత జట్టులో శుభ్‌మన్‌ గిల్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడంతో పాటు యువ ఆటగాళ్లు తమను తాము నిరూపించుకుంటున్నారు. దేవదత్‌ పడిక్కల్‌ బ్యాటింగ్‌లో మంచి అవకాశాలు అందుకుంటుండగా, మానవ్‌ సుతార్‌ స్పిన్‌ విభాగంలో ఆకట్టుకుంటున్నాడు. గాలేలో జరిగిన తొలి టెస్టులో సుతార్‌ అద్భుతంగా రాణించడం జట్టు యాజమాన్యానికి సానుకూలాంశంగా మారింది. గంభీర్‌ ప్రకారం.. కొత్త ఆటగాళ్లకు తగినంత సమయం, వరుస అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక్కటి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రాన వారిపై నిర్ణయానికి రావడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

Loading...
Unable to load recommendations.
Follow Us