AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gautam Gambhir : నీకు హ్యాట్సాఫ్.. ఇంజెక్షన్లు ఇస్తామన్నా వద్దని, నరకం లాంటి నొప్పితోనే మ్యాచ్‌లు ఆడిన గంభీర్

Gautam Gambhir : టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ శారీరక దృఢత్వం, నొప్పిని భరించే శక్తిపై మాజీ ఐపీఎల్ ఫిజియో దీపక్ సూర్య ఆసక్తికర సంచలన నిజాలను వెల్లడించారు. మైదానంలో సీరియస్‌గా కనిపించే గంభీర్ బయట మాత్రం చాలా సరదాగా ఉంటాడని కూడా ఫిజియో దీపక్ చెప్పుకొచ్చారు.

Gautam Gambhir : నీకు హ్యాట్సాఫ్.. ఇంజెక్షన్లు ఇస్తామన్నా వద్దని, నరకం లాంటి నొప్పితోనే మ్యాచ్‌లు ఆడిన గంభీర్
Gautam Gambhir
Rakesh
|

Updated on: May 22, 2026 | 9:46 AM

Share

Gautam Gambhir : గతంలో ఢిల్లీ డెల్ డెవిల్స్ (ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్), బీసీసీఐ నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో పనిచేసిన ప్రముఖ స్పోర్ట్స్ ఫిజియో దీపక్ సూర్య ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో గంభీర్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. సాధారణంగా గాయపడిన ఆటగాళ్లు ఫిజియో రూమ్‌లో ట్రీట్‌మెంట్ చేసేటప్పుడు నొప్పి భరించలేక ఒత్తిడి తగ్గించమని అడుగుతుంటారు. కానీ గంభీర్ మాత్రం ఎంతటి కఠినమైన థెరపీనైనా మారుమాట్లాడకుండా భరించేవాడని సూర్య తెలిపారు. ఒకసారి గంభీర్‌కు భుజంలో తీవ్రమైన సమస్య (షోల్డర్ ఇంపింజ్‌మెంట్) వచ్చింది. నొప్పి తీవ్రతకు డాక్టర్లు మెడికల్ ఇంజెక్షన్లు సిఫార్సు చేశారు. కానీ, గంభీర్ మాత్రం సహజసిద్ధంగా వ్యాయామాల ద్వారానే తగ్గించుకుంటా అని పట్టుబట్టాడు. తన అంకితభావంతో కేవలం ఎక్సర్‌సైజులు చేసి కోలుకోవడమే కాకుండా, మునుపటి కంటే బలమైన త్రోలు విసిరేలా భుజాన్ని సిద్ధం చేసుకుని అక్కడున్న అందరినీ ఆశ్చర్యపరిచాడు. మైదానంలో సీరియస్‌గా కనిపించే గంభీర్ బయట మాత్రం చాలా సరదాగా ఉంటాడని కూడా ఫిజియో దీపక్ చెప్పుకొచ్చారు.

ఇంటర్నేషనల్ క్రికెట్ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఎలా ఉంటుందనే దానిపై దీపక్ సూర్య ఆసక్తికర విషయాలు చెప్పారు. “మీరు గనుక ఒకసారి ప్రొఫెషనల్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్తే.. లైఫ్‌లో మీకు జోకర్లు, కమెడియన్లు అస్సలు అక్కర్లేదనిపిస్తుంది. మన క్రికెటర్ల దగ్గర అన్ని కామెడీ స్టోరీలు, సెన్సాఫ్ హ్యూమర్ ఉంటాయి” అంటూ నవ్వేశారు. అంతేకాకుండా వీరేంద్ర సెహ్వాగ్, ఆశిష్ నెహ్రా వంటి సీనియర్ ఆటగాళ్లకు మానవ శరీరం, ఫిట్‌నెస్, గాయాల నుంచి కోలుకోవడంపై అపారమైన జ్ఞానం ఉందని కొనియాడారు. సెహ్వాగ్‌కు కెరీర్‌లో ఎన్నో చోట్ల ట్రీట్‌మెంట్ తీసుకోవడం వల్ల బాడీ మెకానిక్స్ బాగా తెలుసని, ఫిజియోలు పొరపాటున తప్పుడు కండరాన్ని నొక్కితే.. కచ్చితమైన రిలీజ్ పాయింట్ ఎక్కడ ఉందో ఆయనే రివర్స్‌లో చెప్పేవాడని గుర్తుచేసుకున్నారు. ఇక ఆశిష్ నెహ్రా అయితే ఒక గాయం కాగానే డే-1 నుంచి కోలుకునే వరకు ఎలాంటి రీహాబ్ ప్రోటోకాల్స్ పాటించాలో ఒక పక్కా టైమ్‌లైన్ రాసి ఇచ్చేసేవాడని ప్రశంసించారు.

15 కోట్ల ప్లేయర్ గాయపడితే ఫిజియోల గుండెల్లో రైళ్లు

ఐపీఎల్ లాంటి మెగా టోర్నమెంట్లలో కోట్ల రూపాయల డబ్బు, విపరీతమైన ఒత్తిడి ఉంటాయని, అందువల్ల స్పోర్ట్స్ ఫిజియో జాబ్ చాలా సవాల్‌తో కూడుకున్నదని దీపక్ సూర్య వివరించారు. మైదానంలో 15 నుంచి 20 కోట్ల విలువైన స్టార్ ప్లేయర్ గాయపడినప్పుడు ఫిజియో తీసుకునే ఒక్క చిన్న నిర్ణయం మ్యాచ్ ఫలితాన్ని, అటు ఫ్రాంచైజీ ఆర్థిక పరిస్థితిని, ఇటు ప్లేయర్ కెరీర్‌ను శాసిస్తుందని అన్నారు. ఒకసారి ఒక ఆటగాడి వేలికి దెబ్బ తగిలి జాయింట్ పక్కకు జరిగినప్పుడు, చుట్టుపక్కల వారు దాన్ని గట్టిగా లాగి సరిచేయమన్నారని, కానీ తనకు ఏదో తేడా కొట్టడంతో స్కానింగ్‌కు పంపామన్నారు. అక్కడ చూస్తే వేలు ఫ్రాక్చర్ అయిందని, ఒకవేళ తాము బలాత్కారంగా వేలును లాగి ఉంటే అది మరింత ముదిరి సర్జరీ వరకు వెళ్లిపోయేదని, ఆ ప్లేయర్ నెల రోజుల్లో కోలుకోవాల్సింది పోయి చాలా కాలం ఆటకు దూరమయ్యేవాడని ఒక ఉదాహరణను పంచుకున్నారు.

రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ చిన్నప్పుడే మొనగాళ్లు

టీమిండియా యువ తారలు రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ చిన్న వయసులో ఉన్నప్పటి నుండే తనకు తెలుసని దీపక్ సూర్య పేర్కొన్నారు. శ్రేయస్ అయ్యర్ కెరీర్ మొదటి నుండి ట్రైనింగ్‌ను చాలా సీరియస్‌గా తీసుకునేవాడని చెప్పారు. ఇక రిషభ్ పంత్‌ను అండర్-16 రోజుల నుండి చూస్తున్నానని, పంత్ కొంచెం లావుగా (బల్కీగా) కనిపించినప్పటికీ అతని శారీరక సామర్థ్యం, స్టామినా అసాధారణమైనవని స్పష్టం చేశారు. రంజీ ట్రోఫీలో ఒకే మ్యాచ్‌లో 300 పరుగులు చేయడం అంత తేలిక కాదని, దానికి అద్భుతమైన ఎండ్యూరెన్స్ కావాలని, పంత్ సహజంగానే చాలా బలవంతుడని కొనియాడారు. భయంకరమైన రోడ్డు ప్రమాదం తర్వాత పంత్ కోలుకునేలా చేయడంలో ఫిజియోలు శారీరక చికిత్సతో పాటు మానసిక స్థైర్యాన్ని ఇవ్వడం కూడా ఒక ముఖ్య భాగమని ఆయన వెల్లడించారు.

ధోని మ్యాచ్ ఆడకపోవడానికి అసలు కారణం ఇదే

ఎంఎస్ ధోని గాయంతో బాధపడుతున్నప్పటికీ నెట్స్‌లో సిక్సర్లు కొట్టడం చూసి అభిమానులు తదుపరి మ్యాచ్ ఆడేస్తాడని అనుకుంటారు, కానీ అతను ఇంకా అన్‌ఫిట్‌గానే ఉన్నాడని మేనేజ్‌మెంట్ చెబుతుంది. దీని వెనుక ఉన్న లాజిక్‌ను దీపక్ సూర్య విడమర్చి చెప్పారు. గాయం నుంచి కోలుకునే ప్రక్రియ (రికవరీ ప్రొసెస్) దశలవారీగా జరుగుతుందని, నెట్స్‌లో బ్యాటింగ్ చేయడం అనేది కేవలం రీహాబిలిటేషన్‎లో ఒక భాగం మాత్రమేనని అన్నారు. కోర్ కండరాల సమస్య ఉన్నప్పుడు నిర్దిష్టంగా పుల్ షాట్లు లేదా బాడీని ట్విస్ట్ చేసే డ్రిల్స్ డిజైన్ చేస్తామని, నెట్స్‌లో ఆ కండరం ఎంతవరకు సహకరిస్తుందో పరీక్షించాకే మ్యాచ్ ఆడేందుకు ఫిట్ అని డిక్లేర్ చేస్తామన్నారు. ఈ రోజుల్లో యో-యో టెస్టుతో పాటు ఎన్నో రకాల కఠినమైన పరీక్షలు ఉన్నాయని, ఫిట్‌నెస్ విషయంలో తుది నిర్ణయం ఎప్పుడూ ఫిజియోలదేనని దీపక్ సూర్య స్పష్టం చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us