
Rohit Sharma : భారత క్రికెట్‌లో ఇప్పుడు ఒక సంచలన చర్చ నడుస్తోంది. టీమిండియాకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని అందించిన కెప్టెన్ రోహిత్ శర్మను అనూహ్యంగా ఆ పదవి నుంచి తొలగించడం పెను దుమారం రేపుతోంది. సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించినప్పటికీ, దీని వెనుక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హస్తం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీ20 ప్రపంచకప్ గెలిపించి, తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ముద్దాడిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తీసేయడం వెనుక పెద్ద కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని యువ రక్తాన్ని ప్రోత్సహించాలనే నెపంతో శుభ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగించారు. అయితే, అజిత్ అగార్కర్ లాంటి బలమైన వ్యక్తిత్వం ఉన్న లీడర్ కూడా గౌతమ్ గంభీర్ ఒత్తిడికి లోనయ్యారా? అనే ప్రశ్నను మనోజ్ తివారీ లేవనెత్తారు. “అగార్కర్ తనంతట తానుగా ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోలేడు, దీని వెనుక కోచ్ ఇన్‌పుట్స్ ఖచ్చితంగా ఉండి ఉంటాయి” అని తివారీ కుండబద్దలు కొట్టారు.
రోహిత్ శర్మ వయస్సు 38 ఏళ్లు కావొచ్చు, కానీ అతని ఫిట్‌నెస్, ఫామ్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. మూడు డబుల్ సెంచరీలు బాదిన రికార్డు ఉన్న ఆటగాడిని, నిస్వార్థంగా ఆడే కెప్టెన్‌ను మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మనోజ్ తివారీ మాట్లాడుతూ.. “రోహిత్ లాంటి దిగ్గజానికి ఇది తీరని అవమానం. వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్‌ను తొలగించడానికి ఎలాంటి క్రికెట్ లాజిక్ సరిపోదు. అసలు టీమిండియా ఆడే విధానం చూస్తుంటే నాకు వన్డేలు చూడాలనే ఆసక్తి కూడా పోయింది” అని తన ఆవేదన వ్యక్తం చేశారు.
శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించడం భవిష్యత్తుకు మంచిదే కావొచ్చు, కానీ రోహిత్ శర్మ ఇంకా ఆడాలని కోరుకుంటున్నప్పుడు అతడిని బలవంతంగా పక్కన పెట్టడం క్రీడాకారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రోహిత్ తన బ్యాట్‌తో సమాధానం చెబుతున్నా, మేనేజ్‌మెంట్ మాత్రం వయస్సు కారణాన్ని సాకుగా చూపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. అశ్విన్ వంటి సీనియర్లు కూడా మేనేజ్‌మెంట్ నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తుండటం టీమ్ ఇండియాలో అంతర్గత విభేదాలు ఉన్నాయనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..