
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన జీవిత ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తాను మొదట అర్కిటెక్ట్‌గా స్థిరపడాలని, తరువాత సినిమాలు తీయాలని కలలు కన్నాడని, కానీ చివరకు క్రికెట్‌లో తన కెరీర్‌ను మలచుకున్నాడని చెప్పాడు. 26 ఏళ్ల లేటుగా క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నప్పటికీ, తాను సాధించిన విజయాలు తన నిర్ణయం సరైనదని రుజువు చేశాయని పేర్కొన్నాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి 5/42 బౌలింగ్ ఫిగర్స్‌తో అదరగొట్టాడు. కెరీర్‌లో కేవలం రెండో వన్డే ఆడుతూనే ఐదు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. అతని అసాధారణ ప్రదర్శనతో టీమిండియా 44 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. ఒకప్పుడు టీమిండియా జట్టులో స్థానం కోల్పోయిన వరుణ్, మూడేళ్ల తర్వాత తిరిగి వచ్చి తన ప్రతిభను నిరూపించుకున్నాడు.
టీ20 ప్రపంచకప్ 2021లో దారుణ ప్రదర్శన తర్వాత వరుణ్ చక్రవర్తికి టీమిండియాలో స్థానం దొరకలేదు. కానీ, ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించడంతో అతని కెరీర్ మళ్లీ ఊపందుకుంది. టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టడం వరుణ్‌కు కలిసొచ్చింది. ముందుగా టీ20 ఫార్మాట్‌లో అవకాశం ఇచ్చిన గంభీర్, తర్వాత వన్డే జట్టులోనూ అతనికి స్థానం కల్పించాడు. ఎన్నో విమర్శలు ఉన్నప్పటికీ, ఓ బ్యాటర్‌ను తప్పించి వరుణ్‌ను ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ఎంపిక చేయడం గంభీర్ చేసిన సాహసోపేతమైన నిర్ణయమే. కీలక మ్యాచ్‌లో వరుణ్ బౌలింగ్‌తో మెరిసి, కోచ్ నమ్మకాన్ని నిజం చేశాడు.
న్యూజిలాండ్‌పై విజయం తర్వాత మీడియాతో మాట్లాడిన వరుణ్ చక్రవర్తి, తన ప్రయాణాన్ని గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. “నేను 26 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడటం ప్రారంభించాను. అంతకుముందు వరకు నేను ఆర్కిటెక్ట్‌గా పని చేస్తూ, సినిమాలు తీయాలని కలలు కన్నా. కానీ, నా మార్గం పూర్తిగా మారిపోయింది. ఇది చాలా విచిత్రంగా అనిపించినా, ఇప్పుడు నా కలలు నెరవేరుతున్నాయి కాబట్టి ఆనందంగా ఉంది” అని చెప్పాడు.
తాను ఎప్పుడూ దేవుడిపై భారం వేయకుండా, కేవలం తన ప్రాసెస్‌ను మాత్రమే నమ్ముకున్నానని చెప్పిన వరుణ్, న్యూజిలాండ్‌తో మ్యాచ్ ద్వారా చాలా నేర్చుకున్నానన్నాడు. “ఒక ప్లేయర్‌గా ఆత్మవిశ్వాసం అత్యంత కీలకం. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా వంటి టాప్ ఆటగాళ్లను చూసి నేర్చుకున్నాను. కానీ, మొదటి ఓవర్ వేసినప్పుడు చాలా టెన్షన్ అనిపించింది. వన్డే క్రికెట్ అనుభవం తక్కువగా ఉండటంతో కొంచెం భయపడ్డాను. కానీ, మ్యాచ్ సాగుతున్న కొద్దీ నాపై నమ్మకం పెరిగింది. కోహ్లీ, రోహిత్, హార్దిక్, శ్రేయస్ అయ్యర్‌లాంటి ఆటగాళ్లు నాతో మాట్లాడి నాకు మద్దతుగా నిలిచారు” అని చెప్పాడు.
టీ20 స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న వరుణ్ చక్రవర్తి, వన్డేల్లోనూ తన మిస్టరీ స్పిన్‌తో ప్రత్యర్థులను భయపెడతానని నిరూపించాడు. ముఖ్యంగా, ఛాంపియన్స్ ట్రోఫీలో అతని ప్రదర్శన, టీమిండియా జట్టుకు కొత్త స్పిన్ ఆయుధంగా మారే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. వరుణ్ తన కెరీర్‌లో ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నప్పటికీ, చివరకు ఒక అద్భుతమైన క్రికెటర్‌గా ఎదిగాడు. సినిమా దర్శకుడిగా మారాలని కలలు కన్న వ్యక్తి, ఇప్పుడు భారత క్రికెట్‌ను కొత్త గౌరవ స్థాయికి తీసుకెళ్లే బౌలర్‌గా ఎదిగాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.