
ఐపీఎల్‌కు పోటీగా వివిధ దేశాలు కూడా క్రికెట్ లీగ్‌లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సౌతాఫ్రికాలో SA 20టీ లీగ్, పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ (PPL), బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) తదితర క్రికెట్ లీగ్‌లు జరుగుతున్నాయి. ఐపీఎల్ తో పోటీ పడి టోర్నీ నిర్వహిస్తామని చెబుతోన్న ఆయా క్రికెట్ బోర్డులు నిర్వహణలో మాత్రం చేతులెత్తేస్తున్నాయి. తాజాగా బంగ్లా వేదికగా జరుగుతోన్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) లో ఒక ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. లైవ్ మ్యాచ్ జరుగుతుండగా ఒక్కసారిగా మైదానంలోని ఫ్లడ్ లైట్లు ఆగిపోయాయి. దీంతో స్టేడియం మొత్తం గాఢాందకారంగా మారింది. అయితే మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు సెల్ ఫోన్లతో మైదానంలో వెలుగులు నింపారు. ఈ కారణంగా కాసేపు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. శుక్రవారం రాత్రి ఫార్చ్యూన్ బరిషల్, ఖుల్నా టైగర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
ఫార్చ్యూన్ బరిషల్, ఖుల్నా టైగర్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్.. లీగ్ మ్యాచుల్లో ఆఖరిది కావడంతో అభిమానులు భారీగా హాజరయ్యారు. అందుకు తగ్గట్టుగానే మ్యాచ్ కూడా రసవత్తరంగా ప్రారంభమైంది. అయితే ఆ ఆనందం అభిమానులకు ఎక్కువ సేపు నిలవలేదు. మ్యాచ్ ప్రారంభమైన రెండో ఓవర్ లోనే గ్రౌండ్‌లోని ఫ్లడ్ లైట్స్ ఆగిపోయాయి. బంగ్లాదేశ్ లో విద్యుత్ వినియోగంపై ఆంక్షలు ఉండడం, స్టేడియంకు ఆటోమేటిక్ పవర్ సిస్టం అందుబాటులో లేకపోవడంతో ఫ్లడ్ లైట్స్ అన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా అంధకారంలో మునిగిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారిపోయాయి. ఐపీఎల్‌తో పోటీపడి క్రికెట్ టోర్నీ నిర్వహిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కనీసం పవర్ సప్లై అందించలేకపోతుందా? అని క్రికెట్ ఫ్యాన్స్ అని ట్రోల్ చేస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..