Cricket Viral : స్టేడియంలో క్యాచ్ పడితే..బ్యాంకులో కోట్లు పడ్డాయి..అదృష్టం అంటే ఈ కుర్రాడిదే బాసూ!

Cricket Records : దక్షిణాఫ్రికా SA20 లీగ్‌లో ఒక అభిమాని ఒక చేత్తో క్యాచ్ పట్టి రూ. 1.08 కోట్లు గెలుచుకున్నాడు. డర్బన్ సూపర్ జెయింట్స్, MI కేప్ టౌన్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది.

Cricket Viral : స్టేడియంలో క్యాచ్ పడితే..బ్యాంకులో కోట్లు పడ్డాయి..అదృష్టం అంటే ఈ కుర్రాడిదే బాసూ!
Cricket Viral

Updated on: Dec 28, 2025 | 5:34 PM

Cricket Viral : సాధారణంగా స్టేడియానికి వెళ్లే అభిమానులు తమ అభిమాన ఆటగాళ్లను చూసి మురిసిపోతారు. కానీ సౌతాఫ్రికాలో జరుగుతున్న SA20 లీగ్ లో ఒక అభిమాని మాత్రం ఏకంగా కోటీశ్వరుడిగా మారిపోయాడు. మైదానం వెలుపల స్టాండ్స్‌లో కూర్చుని అతను పట్టిన ఒక్క వన్ హ్యాండెడ్ క్యాచ్ అతని దశను మార్చేసింది. క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన క్యాచ్‌లలో ఒకటిగా నిలిచిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

డర్బన్ సూపర్ జెయింట్స్, MI కేప్ టౌన్ జట్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్ రికార్డులకు వేదికైంది. మొదట బ్యాటింగ్ చేసిన డర్బన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 232/5 భారీ స్కోరు సాధించింది. ఇది SA20 చరిత్రలోనే అత్యధిక స్కోరు. కివీస్ ద్వయం డెవాన్ కాన్వే (64), కేన్ విలియమ్సన్ (40) మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా.. ఐడెన్ మార్క్రామ్, ఇవాన్ జోన్స్ చివర్లో మెరుపులు మెరిపించారు. అనంతరం 233 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన MI కేప్ టౌన్ కూడా గట్టిగానే పోరాడింది. ర్యాన్ రికెల్టన్ 113 పరుగులతో వీరోచిత సెంచరీ చేసినప్పటికీ, ఆ జట్టు 15 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. రెండు జట్లు కలిపి ఈ మ్యాచ్‌లో ఏకంగా 449 పరుగులు సాధించాయి.

ఈ పరుగుల ప్రవాహంలో ర్యాన్ రికెల్టన్ కొట్టిన ఒక భారీ సిక్సర్ ఒక అభిమానిని కోటీశ్వరుడిని చేసింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో రికెల్టన్ బంతిని స్టాండ్స్‌లోకి బాదగా.. అక్కడ కూర్చున్న ఒక యువకుడు అద్భుతమైన ఏకాగ్రతతో ఒక చేత్తో క్యాచ్ పట్టాడు. SA20 లీగ్‌లో అమల్లో ఉన్న క్లీన్ క్యాచ్ ఇనిషియేటివ్ ప్రకారం.. ఒక చేత్తో క్లీన్‌గా క్యాచ్ పట్టే అభిమానులకు భారీ బహుమతి లభిస్తుంది. దీని కింద ఆ అభిమాని 2 మిలియన్ రాండ్స్ (సుమారు రూ.1.08కోట్లు) గెలుచుకున్నాడు. స్టేడియం అంతా ఒక్కసారిగా ఆ అభిమానిని చూసి కేరింతలు కొట్టింది.

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో అభిమానులను ప్రోత్సహించేందుకు నిర్వహకులు ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు బ్యాటర్ కొట్టిన సిక్సర్‌ను స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకుడు ఒకే చేత్తో పట్టుకుంటే, సీజన్ ముగిసే సమయానికి కేటాయించిన భారీ మొత్తాన్ని అటువంటి క్యాచ్‌లు పట్టిన వారందరికీ పంచుతారు. ఈ మ్యాచ్‌లో ఆ యువకుడు పట్టిన క్యాచ్ అతనిని ఒక్కసారిగా వార్తల్లో నిలిచేలా చేసింది. క్రికెట్ అంటే కేవలం వినోదమే కాదు, అదృష్టం ఉంటే ఆదాయం కూడా అని ఈ ఘటన నిరూపించింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..