
Oldest T20 Century: క్రికెట్ మైదానంలో వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ మరోసారి నిరూపించాడు. 41 ఏళ్ల వయసులో సిక్సర్ల వర్షం కురిపిస్తూ, టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత లేటు వయసులో శతకం బాదిన ఆటగాడిగా సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. 9 ఏళ్ల క్రితం నాటి రికార్డును బద్దలు కొడుతూ సృష్టించిన ఈ ఘనత ఇప్పుడు క్రీడాలోకాన్ని ఆశ్చర్యపరుస్తోంది.
అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (MLC) ప్రారంభ మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ వీరోచిత ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. సీటెల్ ఓర్కాస్ జట్టు విధించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన డు ప్లెసిస్ మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 52 బంతుల్లోనే 9 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ తుఫాన్ శతకంతో టెక్సాస్ సూపర్ కింగ్స్ 18.3 ఓవర్లలోనే కేవలం 4 వికెట్లు కోల్పోయి ఘన విజయాన్ని అందుకుంది. ఈ అద్భుతమైన ఫీట్ సాధించే సమయానికి డు ప్లెసిస్ కచ్చితమైన వయసు 41 సంవత్సరాల 340 రోజులు.
ఈ ఇన్నింగ్స్‌తో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ పాల్ కాలింగ్‌వుడ్ పేరిట ఉన్న తొమ్మిదేళ్ల నాటి రికార్డును ఫాఫ్ తుడిచిపెట్టేశాడు. కాలింగ్‌వుడ్ 2017 జులై 30న వోర్సెస్టర్ వేదికగా డర్హామ్ తరపున ఆడుతూ 41 సంవత్సరాల 65 రోజుల వయసులో సెంచరీ సాధించాడు. ఇప్పుడు డు ప్లెసిస్ అంతకంటే ఎక్కువ వయసులో ఈ ఘనత సాధించి ప్రపంచంలోనే అత్యంత వృద్ధ టీ20 సెంచరీ వీరుడిగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు గ్రేమ్ హిక్ (41 ఏళ్ల 37 రోజులు) మూడో స్థానంలో ఉన్నాడు.
Excellent crowd catch!#FafduPlessis #MLC #MajorLeagueCricket #USA #Dallas #T20 #Cognizantpic.twitter.com/O0eaiizR6A
— lightningspeed (@lightningspeedk) June 19, 2026
సాధారణంగా 40 ఏళ్లు వచ్చేసరికి చాలామంది క్రికెటర్లు ఆటకు వీడ్కోలు పలికి కోచింగ్ బాధ్యతల్లో స్థిరపడతారు. కానీ డు ప్లెసిస్ మాత్రం వయసు పెరుగుతున్న కొద్దీ మరింత పదునైన ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు. 40 ఏళ్ల వయసు దాటిన తర్వాత టీ20 క్రికెట్‌లో మూడు శతకాలు బాదిన ప్రపంచంలోని ఏకైక బ్యాటర్‌గా అతను అరుదైన చరిత్ర సృష్టించాడు. గత ఏడాది ఇదే మేజర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఎంఐ న్యూయార్క్‌పై (103 నాటౌట్), శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌పై (100) మెరుపు సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో ఇంగ్లాండ్ ఆటగాడు రవి బొపారా (40 ఏళ్ల 122 రోజులు) ఒక సెంచరీతో ఉన్నప్పటికీ, ఫాఫ్ మూడు శతకాలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో సాధించిన సెంచరీతో ఫాఫ్ డు ప్లెసిస్ అమెరికన్ టీ20 లీగ్ (MLC) చరిత్రలో సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. ఈ లీగ్‌లో 1,000 పరుగుల మార్కును దాటిన ప్రపంచంలోనే మొట్టమొదటి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. లీగ్‌లో ఇప్పటివరకు 20 మ్యాచ్‌లు ఆడిన ఫాఫ్ 1,001 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ హిట్టర్ ఫిన్ అలెన్ 639 పరుగులతో రెండో స్థానంలో ఉండగా, అమెరికా ఆటగాడు మొనాంక్ పటేల్ 611 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..