Ravindra Jadeja : జడేజాకు షాక్.. 2027 వరల్డ్‌కప్ రేసులో అక్షర్ పటేల్ దూకుడు.. టీమిండియాలో చోటు కష్టమేనా?

Ravindra Jadeja : 2027 వన్డే వరల్డ్‌కప్‌కు రవీంద్ర జడేజా ఎంపికపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అక్షర్ పటేల్ అద్భుత ఫామ్‌తో టీమిండియా తొలి ఎంపికగా మారుతున్నట్లు సమాచారం. సెలెక్టర్ల భవిష్యత్ ప్రణాళికల్లో జడేజాకు చోటు దక్కుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Ravindra Jadeja : జడేజాకు షాక్.. 2027 వరల్డ్‌కప్ రేసులో అక్షర్ పటేల్ దూకుడు.. టీమిండియాలో చోటు కష్టమేనా?
Ravindra Jadeja

Updated on: Jul 16, 2026 | 5:48 PM

Ravindra Jadeja : టీమిండియా సీనియర్ స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భవిష్యత్తు వన్డే కెరీర్‌పై సంచలన రిపోర్ట్స్ బయటకు వచ్చాయి. 2027 వన్డే వరల్డ్ కప్‌లో జడేజా ఆడటం దాదాపు అసాధ్యమని మార్కెట్ వర్గాల సమాచారం. టీమిండియా మేనేజ్మెంట్,సెలెక్టర్లు ఇప్పుడు జడేజా పేరును వన్డే ఫార్మాట్ కోసం పరిశీలించడం లేదని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో వన్డే క్రికెట్‌లో జడేజాను మొదటి ప్రాధాన్యత కలిగిన ఆటగాడిగా ఉంచేందుకు సెలెక్టర్లు ఆసక్తి చూపించడం లేదు. జట్టులో టాప్-7 లో బ్యాటింగ్ చేయగల పవర్‌ఫుల్ ప్లేయర్లు కావాలని మేనేజ్మెంట్ గట్టిగా భావిస్తోంది. తదుపరి ప్రపంచకప్ సౌతాఫ్రికాలో జరగనుండటంతో అక్కడ మీడియం పేస్ ఆల్‌రౌండర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, స్పిన్ ఆల్‌రౌండర్ కోటాలో కేవలం ఒక్కరినే ఉంచాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ ఒక్క స్థానానికి ప్రస్తుతం అక్షర్ పటేల్ పేరు టాప్‌లో ఉంది.

ప్రముఖ జాతీయ మీడియాల్లో వస్తున్న కథనాల ప్రకారం.. వైట్ బాల్ క్రికెట్‌లో రవీంద్ర జడేజా బౌలింగ్ ప్రదర్శన గత కొంతకాలంగా ఆశాజనకంగా లేదు. దుబాయ్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయి కాబట్టే ఆయన 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడగలిగారు. బౌలింగ్‌తో పాటు జడేజా బ్యాటింగ్ పవర్ హిట్టింగ్ కూడా మునుపటిలా వేగంగా సాగడం లేదు. చివరి ఓవర్లలో భారీ షాట్లు ఆడటంలో ఆయన తడబడుతున్నారు. ఈ బలహీనతలే అక్షర్ పటేల్ రేసులో దూసుకుపోవడానికి కారణమయ్యాయి. సౌతాఫ్రికా పిచ్‌ల స్వభావాన్ని బట్టి ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒకే ఒక మెయిన్ స్పిన్నర్‌ను ఆడించాలని టీమిండియా భావిస్తోంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అక్షర్ పటేల్‌కు బ్యాకప్‌గా యువ ఆటగాడు హర్ష్ దూబేను కూడా సెలెక్టర్లు సిద్ధం చేస్తున్నారు.

న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రవీంద్ర జడేజా చివరిసారిగా భారత్ తరఫున వన్డే మ్యాచ్ ఆడారు. ఇండోర్‌లో జరిగిన ఆ చివరి వన్డే మ్యాచ్‌లో ఆయన బ్యాట్ నుంచి కేవలం 12 పరుగులు మాత్రమే వచ్చాయి. ఆ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ మొత్తంలో ఆయన కేవలం 43 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇప్పటివరకు జడేజా తన కెరీర్‌లో 210 వన్డే మ్యాచ్‌లు ఆడి 232 వికెట్లు పడగొట్టారు. సీనియర్ ఆటగాడిగా మంచి రికార్డు ఉన్నప్పటికీ, ప్రస్తుత ఫామ్ లేకపోవడం ఆయనకు మైనస్‌గా మారింది.

మరోవైపు అక్షర్ పటేల్ వన్డే ఫార్మాట్‌లో అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తున్నారు. అక్షర్ ఇప్పటివరకు ఆడిన 72 వన్డే మ్యాచ్‌లలో 79 వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా ఆయన ఎకానమీ రేటు ఓవర్‌కు కేవలం 4.5 పరుగులు మాత్రమే ఉండటం విశేషం. బ్యాటింగ్‌లోనూ 50 ఇన్నింగ్స్‌ల్లో 24.72 సగటుతో 915 పరుగులు చేసి మంచి ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఆల్‌రౌండ్ ప్రదర్శనే జడేజా వన్డే కెరీర్‌కు ఎండ్ కార్డ్ వేసేలా కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us