IPL 2026 : ఇకపై మెగా లీగ్‌లో కనిపించని ఆ ఐదుగురు స్టార్ ప్లేయర్లు.. ఆ లిస్ట్‌లో మన యార్కర్ కింగ్ కూడా

IPL 2026 : పీఎల్ అంటేనే కఠినమైన పోటీకి కేరాఫ్ అడ్రస్. ఇక్కడ ఫామ్‌లో ఉంటేనే ఆటగాళ్లకు విలువ, లేదంటే ఎంతటి స్టార్ క్రికెటర్ అయినా బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది. తాజాగా ముగిసిన సీజన్ కొంతమంది సీనియర్, స్టార్ ఆటగాళ్లకు కోలుకోలేని దెబ్బ తీసింది.

IPL 2026 : ఇకపై మెగా లీగ్‌లో కనిపించని ఆ ఐదుగురు స్టార్ ప్లేయర్లు.. ఆ లిస్ట్‌లో మన యార్కర్ కింగ్ కూడా
Ipl 2026 (6)

Updated on: Jun 01, 2026 | 4:22 PM

IPL 2026 : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సరికొత్త చరిత్ర సృష్టిస్తూ రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడటంతో ఐపీఎల్ 2026 సీజన్ ఎంతో గ్రాండ్‌గా ముగిసింది. ఈ సీజన్ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని, అద్భుతమైన రికార్డులను అందించింది. అయితే ఐపీఎల్ అంటేనే కఠినమైన పోటీకి కేరాఫ్ అడ్రస్. ఇక్కడ ఫామ్‌లో ఉంటేనే ఆటగాళ్లకు విలువ, లేదంటే ఎంతటి స్టార్ క్రికెటర్ అయినా బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది. తాజాగా ముగిసిన సీజన్ కొంతమంది సీనియర్, స్టార్ ఆటగాళ్లకు కోలుకోలేని దెబ్బ తీసింది. పేలవమైన ఫామ్, వయసు పైబడటం, గాయాల బారిన పడటం వంటి కారణాల వల్ల ఐదుగురు ప్రముఖ క్రికెటర్లు తమ కెరీర్‌లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడేసినట్లు తెలుస్తోంది.

1. కరుణ్ నాయర్

టీమిండియా మాజీ బ్యాటర్ కరుణ్ నాయర్ ఐపీఎల్ 2026 సీజన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. గత సీజన్లో 8 ఇన్నింగ్స్‌లలో 198 పరుగులు చేసి ఫరవాలేదనిపించడంతో, ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఇతడిని రూ.50 లక్షల బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసింది. మిడిలార్డర్‌లో తన అనుభవంతో జట్టును ఆదుకుంటాడని భావిస్తే, ఈ 34 ఏళ్ల బ్యాటర్ ఘోరంగా విఫలమయ్యాడు. ఈ సీజన్‌లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక కేవలం రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 18 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ కరుణ్ నాయర్ పేలవ ప్రదర్శన విమర్శలకు దారితీసింది. వచ్చే ఏడాది నాటికి ఇతడికి 35 ఏళ్లు వస్తాయి. నేటి తరం టీ20 క్రికెట్‌కు కావాల్సిన మెరుపు వేగం, అగ్రెసివ్ బ్యాటింగ్ ఇతడిలో లోపించాయి. రాబోయే వేలంలో ఢిల్లీ యువ ఆటగాళ్ల వైపు మొగ్గు చూపనుండటంతో, చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK)తో ఆడిన మ్యాచ్‌నే కరుణ్ నాయర్ కెరీర్‌లో చివరి ఐపీఎల్ మ్యాచ్‌గా భావించవచ్చు.

2. టి. నటరాజన్

తమిళనాడుకు చెందిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్, మన యార్కర్ కింగ్ టి.నటరాజన్ ఐపీఎల్‌లో మోస్ట్ రిలయబుల్ బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అందుకే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ సీజన్ వేలంలో ఏకంగా రూ. 10.25 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి నటరాజన్‌ను సొంతం చేసుకుంది. భారీ ధర పలకడంతో ఇతనిపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. సీజన్ ఆరంభంలో కొద్దిగా మెరిసినా, ఆ తర్వాత నటరాజన్ బౌలింగ్ పూర్తిగా గాడి తప్పింది. టోర్నమెంట్ ముగిసేసరికి 10 ఇన్నింగ్స్‌లలో కేవలం 5 వికెట్లు మాత్రమే తీసి, ఏకంగా 11.18 లీస్ట్ ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకున్నాడు. మరీ ముఖ్యంగా వరుసగా 6 మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో ఢిల్లీ మేనేజ్‌మెంట్ ఇతడిని ప్లేయింగ్ ఎలెవన్ నుంచి కూడా తప్పించాల్సి వచ్చింది. వచ్చే ఏడాదికి నటరాజన్‌కు 36 ఏళ్లు వస్తాయి, పైగా కెరీర్ అంతా గాయాల సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి.

3. అన్రిచ్ నోర్ట్జే

సౌతాఫ్రికా స్పీడ్ గన్ అన్రిచ్ నోర్ట్జేను లక్నో సూపర్ జాయింట్స్ (LSG) ఫ్రాంచైజీ రూ.2 కోట్లకు దక్కించుకుంది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ, నోర్ట్జే కెరీర్‌ను గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో తరఫున కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన నోర్ట్జే, వికెట్ ఏమీ తీయకుండానే టోర్నమెంట్ మధ్యలో గాయపడి స్వదేశానికి తిరిగి వెళ్లిపోయాడు. దీంతో లక్నో జట్టుకు ఇతని వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. గత ఐపీఎల్ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కు ఆడినప్పుడు కూడా కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడి భారీగా పరుగులు ఇచ్చాడు. ఫ్రాంచైజీ క్రికెట్‌లో విదేశీ ఆటగాళ్లు సీజన్ అంతా అందుబాటులో ఉండటం చాలా ముఖ్యం. నోర్ట్జే పదే పదే గాయాల బారిన పడుతుండటంతో టీమ్‌లు ఇతనిపై పెట్టుబడి పెట్టడానికి భయపడుతున్నాయి.

4. ట్రెంట్ బౌల్ట్

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన విదేశీ ఫాస్ట్ బౌలర్లలో న్యూజిలాండ్ స్టార్ ట్రెంట్ బౌల్ట్ ఒకడు. కొత్త బంతితో పవర్‌ప్లేలో వికెట్లు తీయడంలో ఇతను దిట్ట. అందుకే ముంబై ఇండియన్స్ (MI) ఈ సీజన్ వేలంలో ఏకంగా రూ. 12.50 కోట్ల భారీ ధరకు బౌల్ట్‌ను తిరిగి కొనుగోలు చేసింది. కానీ, ఈ సీనియర్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌కు ఈ సీజన్ అస్సలు కలిసిరాలేదు. 5 మ్యాచ్‌లు ఆడిన బౌల్ట్ కేవలం 2 వికెట్లు మాత్రమే తీసి తన పాత లయను అందుకోవడానికి తీవ్రంగా శ్రమించాడు. దీంతో ముంబై ఇండియన్స్ వ్యూహాత్మక మార్పులు చేసి బౌల్ట్‌ను పక్కన పెట్టింది. ఇతని స్థానంలో కార్బిన్ బాష్ లాంటి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చింది. ప్రస్తుతం 36 ఏళ్ల వయసున్న బౌల్ట్ తన ప్రొఫెషనల్ కెరీర్ ముగింపు దశకు చేరుకున్నాడు. ముంబై ఇండియన్స్ మెగా వేలానికి ముందు ఇతడిని విడుదల చేయడం ఖాయం, మిగతా జట్లు కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువ పేసర్లనే కోరుకుంటాయి కాబట్టి బౌల్ట్ ఐపీఎల్ ప్రయాణం ముగిసినట్లే.

5. హర్షల్ పటేల్

ఐపీఎల్‌లో పర్పుల్ క్యాప్ గెలిచి, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరొందిన హర్షల్ పటేల్ కెరీర్ ఒక్కసారిగా తలకిందులైంది. గత ఐపీఎల్ 2025 సీజన్‌లో 13 ఇన్నింగ్స్‌లలో 16 వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉండటంతో, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీ ఈ సీజన్ కోసం అతడిని రూ.8 కోట్ల భారీ మొత్తానికి రిటైన్ చేసుకుంది. కానీ ఐపీఎల్ 2026 లో హర్షల్ పటేల్ ప్రదర్శన అత్యంత దారుణంగా తయారైంది. ఈ సీజన్లో ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేకపోగా, 10.82 ఘోరమైన ఎకానమీ రేటుతో పరుగులను సమర్పించుకున్నాడు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ అతడిని తుది జట్టు నుంచి తొలగించాల్సి వచ్చింది. వచ్చే సీజన్ నాటికి హర్షల్‌కు 35 ఏళ్లు నిండుతాయి. హైదరాబాద్ జట్టు తన బౌలింగ్ విభాగాన్ని పూర్తిగా మార్చాలని చూస్తోంది, అలాగే వేలంలో ఫ్రాంచైజీలు పీక్ ఫామ్‌లో ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తాయి కాబట్టి హర్షల్ పటేల్‌కు మళ్లీ ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కడం ఇంపాజిబుల్ అని చెప్పవచ్చు.

Follow Us