Watch: 199 పరుగుల వద్ద ఔట్.. అంపైర్‌పై కోపంతో ఊగిపోయిన పడిక్కల్
Watch: న్యూజిలాండ్ ఏతో తొలి అనధికారిక టెస్టులో దేవదత్ పడిక్కల్ 199 పరుగుల వద్ద ఔటై డబుల్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయాడు. జాక్ గిబ్సన్ బౌలింగ్‌లో అంపైర్ ఔట్ ఇవ్వడంతో అతడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. బంతి బ్యాట్‌కు తగలలేదని సైగలు చేస్తూ అంపైర్ వైపు చూశాడు. మ్యాచ్‌లో DRS లేకపోవడంతో నిర్ణయాన్ని సవాలు చేసే అవకాశం లేకుండా పోయింది.

Devdutt Padikkal: న్యూజిలాండ్ పర్యటనలో భారత్ ఏ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ తన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. తొలి అనధికారిక టెస్టులో మూడో రోజు అద్భుతంగా ఆడుతూ జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అయితే డబుల్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో అతడి ఇన్నింగ్స్ ముగిసింది. జాక్ గిబ్సన్ బౌలింగ్‌లో అంపైర్ ఔట్ ఇవ్వడంతో పడిక్కల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంపైర్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, బంతి తన బ్యాట్‌కు తగలలేదని సైగలు చేశాడు. కొద్దిసేపు క్రీజులోనే నిలబడి తన నిరసనను వ్యక్తం చేసిన తర్వాత పెవిలియన్‌కు వెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అంపైర్ నిర్ణయంపై చర్చ మొదలైంది.
అంపైర్ నిర్ణయంతో పడిక్కల్ ఆగ్రహం
ఇన్నింగ్స్ 89వ ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. అప్పటికే 199 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న పడిక్కల్‌కు న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ జాక్ గిబ్సన్ లెగ్ సైడ్ దిశగా బంతి వేశాడు. దాన్ని ఫ్లిక్ చేసేందుకు ప్రయత్నించిన పడిక్కల్ బంతిని మిస్ అయ్యాడు. బంతి ప్యాడ్‌ను తాకినట్టుగా కనిపిస్తూ వికెట్ కీపర్ మిచెల్ హే చేతుల్లోకి వెళ్లింది. న్యూజిలాండ్ ఆటగాళ్లు క్యాచ్ కోసం అప్పీల్ చేయగా, అంపైర్ బ్రాడ్ విల్సన్ ఔట్‌గా ప్రకటించాడు. బంతి తన బ్యాట్‌కు దూరంగా వెళ్లిందని భావించిన పడిక్కల్ ఈ నిర్ణయాన్ని నమ్మలేకపోయాడు. అంపైర్ వైపు చూస్తూ తన అసంతృప్తిని తెలియజేశాడు.
రివ్యూ తీసుకునే అవకాశం కూడా లేదు
అంతర్జాతీయ టెస్టుల్లో ఇలాంటి సందర్భాల్లో బ్యాటర్ లేదా ఫీల్డింగ్ జట్టు DRS ద్వారా అంపైర్ నిర్ణయాన్ని సవాలు చేయవచ్చు. కానీ భారత్ ఏ, న్యూజిలాండ్ ఏ మధ్య జరుగుతున్నది అనధికారిక టెస్టు కావడంతో ఈ మ్యాచ్‌లో DRS అందుబాటులో లేదు. అందువల్ల పడిక్కల్‌కు రివ్యూ కోరే అవకాశం లేకుండా పోయింది. 200 పరుగుల మైలురాయికి ఇంత దగ్గరగా ఉన్న సమయంలో ఔట్ కావడం అతడికి మరింత నిరాశ కలిగించింది. 248 బంతులు ఎదుర్కొన్న పడిక్కల్ 24 ఫోర్లు, మూడు సిక్సర్లతో 199 పరుగులు చేశాడు.
సాయి సుదర్శన్‌తో భారీ భాగస్వామ్యం
భారత్ ఏ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 113 పరుగులకే ఆలౌటైంది. దీనికి సమాధానంగా న్యూజిలాండ్ ఏ 317 పరుగులు చేసి 204 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత జట్టు 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో పడిక్కల్, సాయి సుదర్శన్ కలిసి మూడో వికెట్‌కు 215 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సుదర్శన్ 92 పరుగులు చేసి సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో ఔటయ్యాడు. అనంతరం యశ్ రాథోడ్‌తో కలిసి పడిక్కల్ మరో కీలక భాగస్వామ్యాన్ని నిర్మించాడు.
🔴DEVDUTT PADIKKAL ANGRY OVER A CONTROVERSIAL UMPIRING DECISION! 🤯
– Padikkal was batting on 199 when the bowler delivered the ball wide. – Padikkal tried to play the delivery, but the umpire suddenly declared him out, apparently believing the ball had edged the bat. – Padikkal was left shocked by the decision.
Note: There is no DRS in unofficial Test matches. ❌ https://t.co/WfZMaQfAXM
— Sam (@cricsam02) October 26, 2026
199 పరుగులతో భారత్ ఏకు కీలక ఆధిక్యం
ఓవర్‌నైట్ స్కోరు 56 పరుగులతో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన పడిక్కల్, న్యూజిలాండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. గాలులతో కూడిన పరిస్థితుల్లోనూ దూకుడుగా ఆడి జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. భారత్ ఏ తరఫున అతడికి ఇది అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో భారత్ ఏ తరఫున 1,000 పరుగుల మైలురాయిని కూడా ఈ ఇన్నింగ్స్‌లో అందుకున్నాడు. అయితే, కర్ణాటక తరఫున గతంలో 232 పరుగులు చేసిన పడిక్కల్‌కు ఈసారి డబుల్ సెంచరీ మాత్రం అందలేదు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఏ 488/8 స్కోరుతో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో వెనుకబడిన జట్టును తిరిగి పోటీలోకి తీసుకురావడంలో పడిక్కల్ ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
