అతడికి అంతర్జాతీయ అనుభం లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో ఆడింది కేవలం 2 మ్యాచ్‌లు.. చేసింది 13 పరుగులు. మొదటి అవకాశం ఇచ్చింది మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని. సీన్ కట్ చేస్తే.. 34 ఫోర్లు, 2 సిక్సర్లతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. చివరి వరకు అజేయంగా నిలిచాడు. అతడెవరో కాదు ధృవ్ షోరే. రంజీ ట్రోఫీలో భారత దేశవాళీ బ్యాట్స్‌మెన్లు అద్భుత ప్రదర్శనలు కనబరుస్తున్నారు. అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఓపెనర్ ధృవ్ షోరే డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 439 పరుగులకు ఆలౌటైంది, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. ఈ స్కోర్‌లో ధృవ్ షోరే ఒక్కడే 252 పరుగులు చేశాడు.
315 బంతులు ఎదుర్కున్న ధృవ్ షోరే తన ఇన్నింగ్స్‌లో 34 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ఈ ఢిల్లీ బ్యాట్స్‌మెన్ తన కెరీర్‌లో మొదటి డబుల్ సెంచరీ సాధించాడు. అంతేకాదు చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో చివరి వరకు అజేయంగా నిలిచి అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. మరోవైపు ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్ బరిలోకి దిగాడు. ఇక ఐపీఎల్‌లో ధృవ్ షోరే కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2018 సీజన్‌లో ఒక మ్యాచ్, 2019లో రెండో మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్ ఫ్రాంచైజీ ఏదీ కూడా ధృవ్ షోరేపై ఆసక్తి చూపించకపోగా.. ఇప్పుడు డిసెంబర్ 23న కొచ్చిలో జరగనున్న మినీ వేలంలో పాల్గొనబోతున్నాడు.