IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా షెడ్యూల్ ఫిక్స్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తేదీలు ఇవే..!
క్రికెట్ అభిమానులకు శుభవార్త..! భారత గడ్డపై ఆస్ట్రేలియా జట్ల పర్యటనకు సంబంధించిన కీలక షెడ్యూల్‌ను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. 2026 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు పుదుచ్చేరి వేదికగా పురుషుల జట్ల మధ్య, అలాగే మొహాలీ, ధర్మశాల వేదికలుగా మహిళల జట్ల మధ్య బహుళ ఫార్మాట్ సిరీస్‌లు జరగనున్నాయి. ఈ పర్యటన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సన్నాహకగా నిలవనుంది.

భారత పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా పురుషుల ‘ఏ’ జట్టు రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబర్ 22 నుంచి 25 వరకు తొలి నాలుగు రోజుల మ్యాచ్, సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 2 వరకు రెండో మ్యాచ్ జరగనుంది. అనంతరం అక్టోబర్ 6, 9, 11 తేదీల్లో వరుసగా మూడు వన్డే మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌లన్నీ పుదుచ్చేరిలోనే జరగడం విశేషం. గతేడాది జరిగిన పర్యటనలో భారత జట్టు ఆధిపత్యం ప్రదర్శించిన నేపథ్యంలో, ఈసారి పోటీ మరింత రసవత్తరంగా మారనుంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2027 పూర్తి వివరాలు..
ఈ ‘ఏ’ సిరీస్ పర్యటన ప్రధానంగా 2027లో జరగబోయే ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సన్నాహకంగా పరిగణించబడుతోంది. జనవరి 21న నాగ్‌పూర్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. రెండో టెస్టు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు చెన్నైలో, మూడో టెస్టు ఫిబ్రవరి 11 నుంచి 15 వరకు గువహటిలో జరగనున్నాయి. సిరీస్ చివరి రెండు మ్యాచ్‌లు రాంచీ, అహ్మదాబాద్ నగరాల్లో ఫిబ్రవరి 19, 27 తేదీల్లో ప్రారంభమవుతాయి.
తొమ్మిదేళ్ల తర్వాత మహిళల జట్ల చారిత్రక పోరు..
దాదాపు తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా మహిళల ‘ఏ’ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా టీ20, వన్డే, టెస్ట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. సెప్టెంబర్ 12, 15 తేదీల్లో మొహాలీలో టీ20 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 17, 20, 23 తేదీల్లో ధర్మశాల వేదికగా వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. చివరగా సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 2 వరకు ఏకైక నాలుగు రోజుల మ్యాచ్‌తో పర్యటన ముగుస్తుంది.
యువ ఆటగాళ్లకు అగ్నిపరీక్ష..
ఈ పర్యటనలో ప్రతిభ చూపే ఆటగాళ్లు భవిష్యత్తులో జాతీయ జట్టులో చోటు సంపాదించే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత స్పిన్ పరిస్థితులను తట్టుకుని నిలబడటం ఆస్ట్రేలియా యువ ఆటగాళ్లకు సవాలుతో కూడుకున్న పని. గత పర్యటనల్లో సామ్ కోన్‌స్టాస్, టాడ్ మర్ఫీ వంటి ఆటగాళ్లు మెరుగైన అనుభవాన్ని గడించగా, ఈసారి కూడా అటువంటి సంచలన ప్రదర్శనలు ఆశించవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
