
Cooper Connolly IPL Century: ఐపీఎల్ 19వ సీజన్లో భాగంగా జరిగిన 49వ ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ కూపర్ కన్నోలీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ జట్టు ఓటమి పాలైనప్పటికీ, కూపర్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం క్రీడాభిమానుల మనసు గెలుచుకుంది. మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపిస్తూ, తన టీ20 కెరీర్లో మొట్టమొదటి శతకాన్ని అత్యున్నత వేదికపై నమోదు చేశాడు.
ఈ మ్యాచ్‌లో కూపర్ కన్నోలీ కేవలం 59 బంతుల్లోనే 107 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 7 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు ఉండటం విశేషం. సుమారు 181.35 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన అతను, 22 ఏళ్ల 257 రోజుల వయసులో ఈ ఘనతను అందుకున్నాడు. దీనితో ఇప్పటివరకు దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్ (23 ఏళ్ల 122 రోజులు) పేరిట ఉన్న రికార్డు కనుమరుగైంది. గతంలో డేవిడ్ వార్నర్, డేవిడ్ మిల్లర్ వంటి దిగ్గజాలు కూడా ఈ జాబితాలో ఉన్నప్పటికీ, కన్నోలీ వారందరినీ వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు.
కూపర్ కన్నోలీ: 22 ఏళ్ల 257 రోజులు
క్వింటన్ డికాక్: 23 ఏళ్ల 122 రోజులు
డేవిడ్ వార్నర్: 23 ఏళ్ల 153 రోజులు
డేవిడ్ మిల్లర్: 23 ఏళ్ల 330 రోజులు
కామెరాన్ గ్రీన్: 23 ఏళ్ల 352 రోజులు
ప్రస్తుత సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కాన్లీ కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లలో 53.86 సగటుతో 377 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. మునుపటి మ్యాచ్‌ల్లో లక్నోపై కూడా 87 పరుగులతో మెరిసిన ఈ యువ ఆటగాడు, భవిష్యత్ స్టార్‌గా ఎదుగుతాడని విశ్లేషకులు భావిస్తున్నారు. తనదైన శైలిలో దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచడంలో అతను సఫలీకృతమవుతున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..