Sourav Ganguly : భారత క్రికెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రివెంజ్.. చాపెల్ ముఖం మీదే తలుపులు మూసేసిన గంగూలీ

Sourav Ganguly : 2005వ సంవత్సరంలో సౌరవ్ గంగూలీనే స్వయంగా నమ్మి గ్రెగ్ చాపెల్‌ను భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా తీసుకువచ్చారు. కానీ, కోచ్ బాధ్యతలు చేపట్టగానే చాపెల్ అసలు రంగు బయటపెట్టారు. గంగూలీకి కెప్టెన్సీ చేసే శారీరక, మానసిక సామర్థ్యం లేదని నేరుగా బీసీసీఐకి రహస్య లేఖ రాశారు.

Sourav Ganguly : భారత క్రికెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రివెంజ్.. చాపెల్ ముఖం మీదే తలుపులు మూసేసిన గంగూలీ
Sourav Ganguly

Updated on: Jun 28, 2026 | 11:54 AM

Sourav Ganguly : భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన అధ్యాయాల్లో సౌరవ్ గంగూలీ – గ్రెగ్ చాపెల్ ఎపిసోడ్ ఒకటి. దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఈ గొడవ తాలూకు చేదు జ్ఞాపకాలు బెంగాల్ టైగర్ మనసులో ఇంకా అలాగే ఉన్నాయని తాజా సంఘటనలు నిరూపిస్తున్నాయి. జైల్లో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని, క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో, ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ పాక్ ప్రభుత్వానికి ఒక పిటిషన్ పంపడానికి చాపెల్ సిద్ధమయ్యారు. దీనిపై సంతకం చేయాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో గంగూలీకి చాపెల్ మెయిల్ చేయగా, దాదా దానిని కనీసం పట్టించుకోకుండా చెత్తబుట్టలో వేశారు.

సత్ప్రవర్తన లేని వారితో నాకేం పని: గంగూలీ

ఇటీవల జరిగిన ఒక ప్రముఖ స్పోర్ట్స్ పాడ్‌కాస్ట్‌లో గంగూలీ మాట్లాడుతూ.. చాపెల్ అభ్యర్థనను తాను ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో వివరంగా చెప్పారు. “అవును, ఆయన నాకు మెయిల్ పంపిన మాట నిజమే, కానీ నేను సమాధానం ఇవ్వలేదు. నిజాయితీ లేని వ్యక్తులకు నేనెప్పుడూ రిప్లై ఇవ్వను. ఒక ఆటగాడిపై మీకు ఎలాంటి అభిప్రాయాలైనా ఉండొచ్చు, కానీ వెన్నుపోటు పొడిచేలా తప్పుడు మార్గాల్లో సమస్యలను పరిష్కరించే వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు” అని గంగూలీ తీవ్రంగా మండిపడ్డారు. నా ముఖం మీదే నువ్వు సరిగ్గా ఆడట్లేదని చెబితే గౌరవిస్తాను కానీ, వెనుక ఉండి గోతులు తీసేవాళ్లను క్షమించనని స్పష్టం చేశారు.

నాడు ఏం జరిగిందంటే?

2005వ సంవత్సరంలో సౌరవ్ గంగూలీనే స్వయంగా నమ్మి గ్రెగ్ చాపెల్‌ను భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా తీసుకువచ్చారు. కానీ, కోచ్ బాధ్యతలు చేపట్టగానే చాపెల్ అసలు రంగు బయటపెట్టారు. గంగూలీకి కెప్టెన్సీ చేసే శారీరక, మానసిక సామర్థ్యం లేదని నేరుగా బీసీసీఐకి రహస్య లేఖ రాశారు. దీనివల్ల దాదా తన కెప్టెన్సీని కోల్పోవడమే కాకుండా, జట్టులో స్థానాన్ని కూడా కోల్పోయి కొన్నాళ్లపాటు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ సారథ్యం చేపట్టగా, 2007 ప్రపంచకప్‌లో భారత్ ఘోర పరాజయం పాలవడంతో చాపెల్ అవమానకరంగా తప్పుకోవాల్సి వచ్చింది.

ఐపీఎల్‌లో కేకేఆర్ కోచ్ అవుతానంటూ చాపెల్ ఆఫర్

ఈ ఇంటర్వ్యూలోనే గంగూలీ మరో ఆసక్తికరమైన రహస్యాన్ని బయటపెట్టారు. టీమిండియా నుంచి తప్పుకున్న తర్వాత, 2011లో గంగూలీ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సమయంలో చాపెల్ మళ్లీ దాదాని సంప్రదించారు. “నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఆయన కేకేఆర్ జట్టుకు కోచ్‌గా రావాలని ఆశపడ్డారు, దానికి నా మద్దతు అడిగారు. నన్ను కెప్టెన్‌గా పెట్టి ఆయన కోచ్ అవ్వడం చాలా అద్భుతంగా ఉండేదేమో వీరంతా దాదాను అమాయకుడిని అనుకుంటున్నారు కాబోలు. నేను ఒకసారి మూర్ఖుడిని అవ్వగలను కానీ, రెండోసారి కాదు” అంటూ గంగూలీ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

 

మరిన్ని ఆసక్తికర క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us