
Cricket Controversy: ఇంగ్లాండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ చుట్టూ ముసురుకున్న నైట్‌క్లబ్ వివాదం కొత్త మలుపు తిరిగింది. డెర్బీ సిటీ సెంటర్‌లోని ఒక నైట్‌క్లబ్ వద్ద జరిగిన ఘర్షణ ఘటనపై డెర్బీషైర్ పోలీసులు అధికారిక విచారణ ప్రారంభించారు. సోషల్ మీడియాలో సంకెళ్లతో కనిపిస్తున్న వీడియో వైరల్ కావడంతో ఈ వ్యవహారం క్రికెట్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంగ్లాండ్ క్రికెటర్ బ్రైడన్ కార్స్ చిక్కుకున్న ఈ నైట్‌క్లబ్ వివాదంపై డెర్బీషైర్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. డెర్బీ నగరంలో జరిగిన దాడి ఘటనపై విచారణ జరుపుతున్నట్లు బుధవారం తెలిపారు. ఇప్పటివరకు ఎవరినీ అధికారికంగా అరెస్టు చేయలేదని, దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. వీడియోలో బ్రైడన్ కార్స్ పోలీసుల ఆధీనంలో కనిపించినప్పటికీ, ఈ గొడవలో ఆయన పాత్ర ఎంతవరకు ఉందనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఆయన నిందితుడిగా ఉన్నారా లేదా కేవలం ప్రత్యక్ష సాక్షిగా అక్కడ నిలబడ్డారా అనే విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు.
సంకెళ్లతో కనిపించిన ఫాస్ట్ బౌలర్
నైట్‌క్లబ్ బయట బ్రైడన్ కార్స్‌కు పోలీసులు సంకెళ్లు వేసి పట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం మొదట వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో హంగామా చేస్తున్నారనే అనుమానంతో పోలీసులు మొదట ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఎటువంటి కేసులు నమోదు చేయకుండానే, ఆ ప్రాంతం ఖాళీ చేసి వెళ్ళిపోవాలనే నిబంధనపై డి-అరెస్ట్ చేసి విడుదల చేశారు.
జట్టు నుంచి వేటు పడటంతో కెరీర్‌కు దెబ్బ
ఈ రచ్చ ప్రభావం కార్స్ క్రికెట్ కెరీర్‌పై తీవ్రంగా పడింది. పాకిస్థాన్‌తో జరగబోయే రెండో టెస్టు మ్యాచ్‌కు ఎంపిక చేసిన ఇంగ్లాండ్ జట్టు నుంచి ఆయనను పక్కన పెట్టారు. ఈ ఘటన జరిగిన సమయంలో కార్స్ జాతీయ జట్టు విధుల్లో లేరు. తన కౌంటీ జట్టు డర్హామ్ తరఫున ఆడుతున్నారు. డెర్బీషైర్‌పై డర్హామ్ సాధించిన అద్భుత విజయం తర్వాత ఆటగాళ్ళందరూ సంబరాలు చేసుకోవడానికి నైట్‌క్లబ్‌కు వెళ్ళిన సమయంలో ఈ వివాదం చోటుచేసుకుంది.
బెన్ స్టోక్స్ ఉనికిపై రకరకాల ప్రచారాలు
నెట్టింట వైరల్ అవుతున్న దృశ్యాల్లో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, మరో ఆటగాడు మాథ్యూ పోట్స్ కూడా ఆ ప్రాంతం సమీపంలో కనిపిస్తున్నారు. అయితే పోలీసుల విచారణలో వీరి పాత్రపై ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు. గత కొన్ని నెలలుగా ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు చెందిన ఆటగాళ్ళు మైదానం వెలుపల అనేక వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పుడు కార్స్ వ్యవహారం కూడా బోర్డుకు పెద్ద సమస్యగా మారింది. ఈ ఘటనపై విచారణ పూర్తయితేనే అసలు ఏం జరిగిందనే దానిపై స్పష్టత రానుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..