Brett Lee : బ్యాటర్లకు చెమటలు.. స్పీడోమీటర్‎కి వణుకు.. బ్రెట్ లీ బుల్లెట్ బంతుల వెనుక అసలు గుట్టు ఇదే!

Brett Lee : ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం బ్రెట్ లీ తన కెరీర్‌లో వికెట్ల కంటే 160 కి.మీ వేగంతో బౌలింగ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నానని వెల్లడించారు. బ్రెట్ లీ తన బౌలింగ్ టెక్నిక్ గురించి వివరిస్తూ.. రన్-అప్, ల్యాండింగ్ సమయంలో ముందు కాలును బలంగా ఉంచడం అత్యంత ముఖ్యమని చెప్పారు.

Brett Lee : బ్యాటర్లకు చెమటలు.. స్పీడోమీటర్‎కి వణుకు.. బ్రెట్ లీ బుల్లెట్ బంతుల వెనుక అసలు గుట్టు ఇదే!
Brett Lee

Updated on: Dec 28, 2025 | 5:00 PM

Brett Lee : క్రికెట్ మైదానంలో బుల్లెట్ వేగంతో బంతులు విసురుతూ ప్రపంచ దిగ్గజ బ్యాటర్లను వణికించిన ఆస్ట్రేలియా పేస్ స్టార్ బ్రెట్ లీ పేరు వింటేనే ఒక సంచలనం. ఇటీవల ఆస్ట్రేలియన్ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‎లో చోటు దక్కించుకున్న సందర్భంగా ఆయన తన కెరీర్‌లోని అత్యంత ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. బ్రెట్ లీకి వికెట్లు తీయడం కంటే, గంటకు 160 కిలోమీటర్ల వేగంతో బంతిని విసరడమే తన జీవిత ఆశయమని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

బ్రెట్ లీ వేగవంతమైన బౌలింగ్ పట్ల ఎంత పిచ్చిగా ఉండేవారంటే.. కేవలం తొమ్మిదేళ్ల వయసులోనే 160 కి.మీ వేగాన్ని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక ఫాస్ట్ బౌలర్‌కు ఉండాల్సిన జన్యుపరమైన లక్షణాలు తన తల్లి హెలెన్ (స్ప్రింటర్) నుంచి వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు. “జట్టు విజయం, ప్రపంచకప్ గెలవడం ఎప్పుడూ మొదటి ప్రాధాన్యతలే. కానీ వ్యక్తిగత విజయాల విషయానికి వస్తే, నాకు వికెట్లు తీయడం కంటే ఆ 160 కి.మీ వేగాన్ని అందుకోవడమే ముఖ్యం. దాని కోసమే నా జీవితాన్ని అంకితం చేశాను” అని బ్రెట్ లీ ఉద్వేగంగా చెప్పారు.

బ్రెట్ లీ తన రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో రెండుసార్లు ఈ అద్భుతమైన మైలురాయిని దాటారు. మొదటిసారి 2003 ప్రపంచకప్ సెమీఫైనల్లో శ్రీలంక బ్యాటర్ మర్వన్ అటపట్టుకు గంటకు 160.1 కి.మీ వేగంతో బంతిని విసిరి అవుట్ చేశారు. ఆ సమయంలో స్కోరు బోర్డుపై ఆ వేగాన్ని చూసినప్పుడు కలిగిన ఆనందం వర్ణనాతీతమని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత 2005 మార్చి 5న న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో గంటకు 160.8 కి.మీ వేగంతో బంతిని విసిరి తన కెరీర్‌లోనే అత్యంత వేగవంతమైన బంతిగా రికార్డు సృష్టించారు. విశేషమేమిటంటే, ఆ సమయంలో ఆయన 18 నెలల పాటు టెస్ట్ జట్టుకు దూరంగా ఉన్నారు, కానీ శారీరకంగా మాత్రం అత్యంత ఫిట్‌గా ఉన్నానని తెలిపారు.

బ్రెట్ లీ తన బౌలింగ్ టెక్నిక్ గురించి వివరిస్తూ.. రన్-అప్, ల్యాండింగ్ సమయంలో ముందు కాలును బలంగా ఉంచడం అత్యంత ముఖ్యమని చెప్పారు. తన ఎడమ చేయి ఎంత వేగంగా కిందకు వస్తే, కుడి చేయి కూడా అంతే వేగంతో బంతిని విసురుతుందని, ఇదే తన స్పీడ్ రహస్యమని వెల్లడించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 718 వికెట్లు తీసినప్పటికీ, ఆ వేగవంతమైన బంతులు విసిరిన క్షణాలే తన గుండెకు దగ్గరైనవని బ్రెట్ లీ పేర్కొన్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..