
Mohsin Naqvi : ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్ విజయం సాధించిన తర్వాత, విజేతలకు ట్రోఫీ అందించే విషయంలో తలెత్తిన వివాదం మరింత ముదురుతోంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోసిన్ నఖ్వీ వ్యవహరించిన తీరుపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ట్రోఫీని నఖ్వీ చేతుల మీదుగా తీసుకోడానికి భారత జట్టు నిరాకరించడంతో ఆయన ట్రోఫీని ఏసీసీ హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉంచాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో నఖ్వీని ఐసీసీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ పదవి నుంచి తొలగించేందుకు బీసీసీఐ బలమైన చర్యలు తీసుకోబోతోందని తెలుస్తోంది.
ట్రోఫీని స్వయంగా తానే వచ్చి కెప్టెన్‌కు లేదా బీసీసీఐ ప్రతినిధులకు ఇస్తానని నఖ్వీ మొండిగా చెబుతున్నప్పటికీ, ఆసియా కప్‌కు పాకిస్థాన్ అధికారిక ఆతిథ్యం ఇచ్చింది కాబట్టి, విజేతగా నిలిచిన భారత్‌కు ట్రోఫీని తక్షణమే అప్పగించాల్సిందేనని బీసీసీఐ స్పష్టం చేస్తోంది. నఖ్వీ వివాదాస్పద వైఖరిపై బీసీసీఐ తీవ్రంగా స్పందించాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. న్యూస్ ఏజెన్సీ పీటీఐ నివేదిక ప్రకారం.. బీసీసీఐ ఇప్పుడు నఖ్వీని మందలించాలని, ఐసీసీలోని బోర్డు ఆఫ్ డైరెక్టర్ పదవి నుంచి తొలగించాలని కూడా చూస్తోంది.
ఈ టోర్నీకి పాకిస్థాన్ అధికారిక ఆతిథ్యం ఇచ్చింది కాబట్టి, నఖ్వీ స్వయంగా ట్రోఫీని ఇవ్వడానికి పట్టుబట్టడం లేదా బీసీసీఐకి పంపకుండా నిరాకరించడం సరైనది కాదని బీసీసీఐ భావిస్తోంది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా కూడా ఆసియా కప్ నఖ్వీ వ్యక్తిగత సొత్తు కాదని గట్టి కౌంటర్ ఇచ్చారు. నఖ్వీ ధోరణి ఇలాగే కొనసాగితే కఠిన చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
🚨 INDIA PLANS TO SANCTION MOHSIN NAQVI FROM ICC 🚨
– The BCCI has plans to get Mohsin Naqvi censured and possibly removed from ICC board of directors. (PTI). pic.twitter.com/EBDurnsTMs
— Tanuj (@ImTanujSingh) October 11, 2025
ఈ ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్థాన్ మధ్య శత్రుత్వం మ్యాచ్‌ల కంటే ఎక్కువగా చర్చనీయాంశమైంది. టోర్నీ మొదటి మ్యాచ్‌లోనే పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో షేక్ హ్యాండ్ ఇవ్వకుండా దూరం ఉండాలని ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ చెప్పారంటూ పీసీబీ ఆరోపించింది. గ్రూప్ A మ్యాచ్ సమయంలో తమ డిమాండ్స్ నెరవేర్చకపోతే యూఏఈతో జరగబోయే మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని కూడా పాకిస్థాన్ ఆలోచించినట్లు నివేదికలు వచ్చాయి. సూపర్ 4, ఫైనల్ మ్యాచ్‌లలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదాలు జరిగాయి. బీసీసీఐ, పీసీబీ ఫిర్యాదుల మేరకు ఐసీసీ ఆటగాళ్లకు జరిమానాలు కూడా విధించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..