
Gautam Gambhir : టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను పదవి నుంచి తొలగిస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. కివీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ ఓడిపోవడం, ఆపై వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోవడంతో గంభీర్ కోచింగ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆయనను తప్పించి కొత్త కోచ్‌ను తెస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే ఈ రూమర్లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఘాటుగా స్పందించింది.
రాజీవ్ శుక్లా ఏమన్నారంటే?
బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఈ వ్యవహారంపై నోరు విప్పారు. గంభీర్‌ను తొలగిస్తున్నారనేది కేవలం మీడియా సృష్టి అని కొట్టిపారేశారు. “కోచ్ మార్పు గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. మా వద్ద అలాంటి ప్లాన్ ఏదీ లేదు. గంభీర్ పదవికి ఎలాంటి ఢోకా లేదు” అని ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన స్పష్టం చేశారు. దీంతో గంభీర్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
బీసీసీఐ సెక్రటరీ సీరియస్
అంతకుముందు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా కూడా ఇదే విషయంపై స్పందించారు. గంభీర్‌ను తీసేస్తున్నారనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, ఇదంతా ఎవరో కల్పించిన కట్టుకథ అని ఆయన మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు కావాలనే తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయని, టీమ్ ఇండియా కొత్త కోచ్ కోసం తాము ఎలాంటి అన్వేషణ చేయడం లేదని ఆయన తేల్చి చెప్పారు.
ముందున్నది అసలైన సవాలు
టెస్టుల్లో పరాజయాలను పక్కన పెట్టి, టీమిండియా ఇప్పుడు వైట్ బాల్ క్రికెట్‌పై దృష్టి సారించనుంది. ముఖ్యంగా 2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ భారత్‌కు చాలా కీలకం. ఈ మెగా టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే ఈ టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచి తన టైటిల్‌ను కాపాడుకోవాలని టీమ్ ఇండియా పట్టుదలతో ఉంది. గంభీర్ పర్యవేక్షణలోనే జట్టు ఈ టోర్నీకి సిద్ధం కానుంది.
మొత్తానికి బీసీసీఐ ఇచ్చిన ఈ క్లారిటీతో కోచ్ మార్పుపై జరుగుతున్న చర్చకు తెరపడింది. ఇప్పుడు అందరి దృష్టి గంభీర్ సారథ్యంలో భారత్ మళ్ళీ విజయాల బాట ఎలా పడుతుంది అనే అంశంపైనే ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.