AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Babar Azam : పాక్ నుంచి ఫస్ట్.. ఆసియాలో రెండో వాడు.. ప్రపంచంలో మూడో వాడు.. బాబర్ ఆజం చారిత్రాత్మక రికార్డు

Babar Azam : పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో పెషావర్ జల్మీ కెప్టెన్‌గా ఉన్న బాబర్ ఆజం, క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 51 బంతుల్లో 71 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.

Babar Azam : పాక్ నుంచి ఫస్ట్.. ఆసియాలో రెండో వాడు.. ప్రపంచంలో మూడో వాడు.. బాబర్ ఆజం చారిత్రాత్మక రికార్డు
Babar Azam Practice Video
Rakesh
|

Updated on: Apr 16, 2026 | 7:00 PM

Share

Babar Azam : పాకిస్థాన్ క్రికెట్ స్టార్ బాబర్ ఆజం టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అటు ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ తన బ్యాట్‌తో పరుగుల వరద పారిస్తుంటే, ఇటు పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో బాబర్ ఆజం రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు. ఏప్రిల్ 15న కరాచీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బాబర్ ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 100 హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న ప్రపంచంలోని మూడో బ్యాటర్‌గా బాబర్ నిలిచాడు. ఈ క్రమంలో పాకిస్థాన్‌లో నంబర్ 1గా, ఆసియాలో నంబర్ 2గా అవతరించి తన సత్తా చాటాడు.

పాకిస్థాన్‌లో నంబర్ 1

పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో పెషావర్ జల్మీ కెప్టెన్‌గా ఉన్న బాబర్ ఆజం, క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 51 బంతుల్లో 71 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలోనే అతడు తన టీ20 కెరీర్‌లో 100వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇప్పటివరకు ఏ పాకిస్థాన్ బ్యాటర్ కూడా టీ20ల్లో ఈ మార్కును చేరుకోలేదు. బాబర్ కేవలం 354 మ్యాచ్‌ల్లోనే (341 ఇన్నింగ్స్) ఈ ఘనత సాధించడం విశేషం.

ఆసియాలో కోహ్లీ తర్వాత బాబరే

ఆసియా ఖండం పరంగా చూస్తే, టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా బాబర్ నిలిచాడు. మొదటి స్థానంలో భారత దిగ్గజం విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ ఇప్పటివరకు 419 మ్యాచ్‌ల్లో 107 హాఫ్ సెంచరీలు సాధించాడు. విరాట్ కోహ్లీకి అత్యంత సమీపంలో ఉన్న ఏకైక ఆసియా బ్యాటర్ బాబరే కావడం గమనార్హం. వీరిద్దరి మధ్య ఉన్న రికార్డుల పోటీ ఎప్పుడూ క్రికెట్ అభిమానులకు ఆసక్తిని కలిగిస్తుంది.

ప్రపంచ జాబితాలో మూడో స్థానం

ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన వారి జాబితాలో బాబర్ ఇప్పుడు మూడో స్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ వార్నర్ 116 హాఫ్ సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ (107) రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు 100 హాఫ్ సెంచరీలతో బాబర్ ఆజం వీరి సరసన చేరాడు. బాబర్ ఆడుతున్న స్పీడ్ చూస్తుంటే త్వరలోనే వార్నర్, కోహ్లీ రికార్డులను కూడా దాటేసేలా కనిపిస్తున్నాడు.

బాబర్ ‘వంద’ హాఫ్ సెంచరీలు ఎలా వచ్చాయంటే?

బాబర్ ఆజం ఈ 100 హాఫ్ సెంచరీలను వివిధ టోర్నీల్లో సాధించాడు. ఇందులో అంతర్జాతీయ టీ20ల్లో చేసిన 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మిగిలినవి వివిధ లీగ్ లలో నమోదు చేశాడు.

టీ20 ఇంటర్నేషనల్: 39

పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL): 38

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL): 03

బిగ్ బాష్ లీగ్ (BBL): 02

లంక ప్రీమియర్ లీగ్ (LPL): 01

వీటితో పాటు ఇతర దేశవాళీ టీ20 మ్యాచ్‌ల్లో మిగిలిన హాఫ్ సెంచరీలు సాధించాడు. బాబర్ ఆజం నిలకడైన ఫామ్ చూస్తుంటే అతడు టీ20ల్లో మరిన్ని అద్భుతాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us