Axar Patel : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అక్షర్ పటేల్ సరికొత్త రికార్డు.. టాప్-10లో నిలిచిన ఏకైక భారతీయుడు

Axar Patel ICC Ranking : ఇంగ్లాండ్‌పై మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో అక్షర్ పటేల్ ఐసీసీ వన్డే ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో 9వ స్థానానికి చేరుకున్నాడు. టాప్-10లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడిగా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించాడు. బ్యాట్, బాల్‌తో అదరగొట్టిన అక్షర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Axar Patel : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అక్షర్ పటేల్ సరికొత్త రికార్డు.. టాప్-10లో నిలిచిన ఏకైక భారతీయుడు
Axar Patel

Updated on: Jul 15, 2026 | 5:59 PM

Axar Patel ICC Ranking : ఐసీసీ తాజాగా బుధవారం విడుదల చేసిన వన్డే ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ ఆటగాడు అక్షర్ పటేల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మొదటి వన్డే మ్యాచ్‌లో అక్షర్ అటు బంతితోనూ, ఇటు బ్యాట్‌తోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్‌కు గానూ అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. దీని ప్రభావంతో ఐసీసీ తాజా వన్డే ఆల్‌రౌండర్ల జాబితాలో అక్షర్ పటేల్ భారీగా పాయింట్లను మెరుగుపరుచుకుని, టాప్-10 లో నిలిచిన ఏకైక భారతీయ ఆల్‌రౌండర్‌గా ఘనత సాధించాడు.

ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న భారత్‌కు అక్షర్ పటేల్ తన స్పిన్ మాయాజాలంతో పెద్ద దిక్కుగా నిలిచాడు. అత్యంత కీలకమైన సమయంలో ఇంగ్లాండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతూ 9.5 ఓవర్లలో 62 రన్స్ ఇచ్చి అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 11 రన్స్, విరాట్ కోహ్లీ 5 రన్స్ కే అవుట్ అయి పెవిలియన్ చేరిన వేళ టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. బాగా ఆడుతున్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా 80 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడంతో మ్యాచ్ భారత్ చేతుల్లోంచి జారిపోయేలా కనిపించింది. ఆ సమయంలో ఏడో స్థానంలో క్రీజులోకి వచ్చిన అక్షర్ కేవలం 52 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో అజేయంగా 57 పరుగులు చేసి భారత్‌కు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. ఈ వీరోచిత ఇన్నింగ్స్ వల్లే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి 213 రేటింగ్ పాయింట్లతో అక్షర్ పటేల్ 9వ స్థానానికి చేరుకున్నాడు.

ప్రస్తుతం విడుదలైన ఐసీసీ వన్డే ఆల్‌రౌండర్ల తాజా జాబితాలో అఫ్గానిస్తాన్ సంచలనం అజ్మతుల్లా ఒమర్జాయ్ 316 రేటింగ్ పాయింట్లతో ప్రపంచ నంబర్-1 ఆల్‌రౌండర్‌గా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్ స్టార్ మెహదీ హసన్ మిరాజ్ 260 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ టాప్-10 జాబితాలో అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, జింబాబ్వే, స్కాట్లాండ్, శ్రీలంక, పాకిస్థాన్, భారతదేశానికి చెందిన అత్యుత్తమ ఆటగాళ్లు నిలిచారు. భారత్ తరఫున కేవలం అక్షర్ పటేల్ మాత్రమే టాప్-10 లో చోటు దక్కించుకోగా, మిగతా సీనియర్ ఆటగాళ్లు ఎవరూ ఈ లిస్టులో లేకపోవడం గమనార్హం.

అక్షర్ పటేల్ ప్రస్తుతం టీమిండియాకు నమ్మదగిన త్రీ-డైమెన్షనల్ ఆటగాడిగా ఎదిగాడు. భారత్ తరఫున మూడు ఫార్మాట్లలోనూ (టెస్ట్, వన్డే, టీ20) స్థిరమైన ప్రదర్శన ఇస్తున్నాడు. అక్షర్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఇప్పటివరకు 15 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 688 పరుగులు చేయడంతో పాటు 57 వికెట్లు పడగొట్టాడు. అలాగే 72 వన్డే మ్యాచ్‌లలో 915 పరుగులు చేసి, 79 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక పొట్టి ఫార్మాట్ అయిన టీ20 ఇంటర్నేషనల్స్‌లో 101 మ్యాచ్‌లు ఆడిన అక్షర్ పటేల్, బ్యాట్‌తో 750 పరుగులు చేసి బౌలింగ్‌లో 101 వికెట్లు తీసి సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. అక్షర్ లోయర్ ఆర్డర్‌లో చూపిస్తున్న ఈ బ్యాటింగ్ పరిణితి భవిష్యత్తులో భారత్‌కు మరిన్ని అద్భుత విజయాలను అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us