AUS vs IND: సెంచరీతో కదం తొక్కిన కింగ్ కోహ్లీ.. టీమిండియా రెండో ఇన్నింగ్స్ డిక్లేర్.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే?

|

Nov 24, 2024 | 3:24 PM

పెర్త్ టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. ఆస్ట్రేలియా బౌలర్లను చిత్తు చేస్తూ రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోరు నమోదు చేసింది. యశస్వి జైస్వాల్ (161) కు తోడు విరాట్ కోహ్లీ (100 నాటౌట్) కూడా సెంచరీబాదడంతో భారత్ భారీ స్కోరుతో డిక్లేర్ చేసింది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం లాంఛనమే.

AUS vs IND: సెంచరీతో కదం తొక్కిన కింగ్ కోహ్లీ.. టీమిండియా రెండో ఇన్నింగ్స్ డిక్లేర్.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే?
Virat Kohli
Follow us on

పెర్త్ వేదికగా జరుగుతోన్న తొలి టెస్టు లో టీమిండియా ఆస్ట్రేలియాకు భారీ విజయ లక్ష్యాన్ని విధించింది. విరాట్‌ కోహ్లీ (100 నాటౌట్), యశస్వి జైస్వాల్‌ (161) సెంచరీలతో అదరగొట్టడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్ల 487 పరుగులు చేసింది. మొదట ఇన్నింగ్స్ ఆధిక్యం కలిపి ఆసీస్ ఎదుట 534 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌ (77) అర్ధశతకం సాధించగా.. పడిక్కల్‌ (25), సుందర్‌ (29) ఫర్వాలేదనిపించారు. ఇక ఆఖరులో తెలుగు క్రికెటర్ నితీశ్‌ రెడ్డి (27 బంతుల్లో 38 నాటౌట్, 3 ఫోర్లు, 2 సిక్సర్లు ) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 150 పరుగులు చేయగా, ఆసీస్‌ 104 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే భారత్ ఇన్నింగ్స్ 150 పరుగుల వద్ద ముగిసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా కేవలం 104 పరుగులకే పరిమితం చేసింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో భారత్ కు  46 పరుగుల ఆధిక్యం లభించింది.

 

ఇవి కూడా చదవండి

మొదటి ఇన్నింగ్స్  ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఓపెనింగ్ ద్వయం కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ శుభారంభం చేశారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 201 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా పటిష్ట స్థితిలోకి వచ్చింది. యశస్వి జైస్వాల్ 297 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 161 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 176 బంతులు ఎదుర్కొని 5 ఫోర్ల సాయంతో 77 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. చాలా రోజుల తర్వాత మూడంకెల స్కోరు చేశాడు. కోహ్లీ సెంచరీ పూర్తయిన వెంటనే కెప్టెన్ బుమ్రా ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు.

టెస్టుల్లో 30వ సెంచరీ..

రెండు జట్ల ప్లేయింగ్-XI ఇలా..

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుషాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హేజిల్‌వుడ్.

భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా (కెప్టెన్), మహ్మద్ సిరాజ్

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.