
Australia vs England, Gabba Test: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఒక అనూహ్య నిర్ణయం తీసుకుంది. జట్టు సీనియర్ స్పిన్నర్, ‘ది గోట్’గా పేరుగాంచిన నాథన్ లియాన్‌ను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత నాథన్ లియాన్ లేకుండా ఆస్ట్రేలియా జట్టు సొంతగడ్డపై ఒక టెస్ట్ మ్యాచ్ ఆడుతుండటం గమనార్హం.
గత దశాబ్ద కాలంగా ఆస్ట్రేలియా టెస్ట్ బౌలింగ్ విభాగంలో నాథన్ లియాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. డిసెంబర్ 2011 నుంచి ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన ప్రతి టెస్ట్ మ్యాచ్‌లోనూ లియాన్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పటివరకు స్వదేశంలో వరుసగా 69 టెస్టులు ఆడిన రికార్డు ఆయన పేరిట ఉంది. తాజా నిర్ణయంతో ఈ సుదీర్ఘ పరంపరకు తెరపడింది.
చివరిసారిగా 2012, జనవరి 13న భారత్‌తో పెర్త్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో నాథన్ లియాన్‌ను జట్టు నుంచి తప్పించారు. ఆ తర్వాత గడిచిన 13 ఏళ్లలో (సుమారు 5082 రోజులు) ఆస్ట్రేలియా ఆడిన ప్రతి హోమ్ టెస్టులోనూ లియాన్ భాగమయ్యారు.
పింక్ బాల్ టెస్ట్ కావడంతో వ్యూహాత్మక మార్పుల్లో భాగంగా పేసర్లకు అనుకూలించే పిచ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టాస్ సమయంలో ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ, నాథన్ లియాన్ స్థానంలో పేస్ బౌలర్ మైఖేల్ నెసర్ (Michael Neser)ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించాడు.
ఇటీవల కాలంలో లియాన్ పింక్ బాల్ టెస్టులకు దూరంగా ఉండటం ఇది రెండోసారి కావడం విశేషం. ఏది ఏమైనా, ఆస్ట్రేలియా గడ్డపై అత్యంత విజయవంతమైన స్పిన్నర్లలో ఒకరైన లియాన్ లేకుండా కంగారు జట్టు బరిలోకి దిగడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..