Asian Games 2026: గోల్డ్ మెడల్ కొట్టిన క్రికెటర్లపై కాసుల వర్షం.. ఒక్కొక్కరికి ఏకంగా రూ.3 కోట్లు

Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు పసిడి పతకాలు సాధించి సంచలనం సృష్టించాయి. విజేతలకు రాష్ట్ర ప్రభుత్వాలు భారీ నగదు బహుమతులు ప్రకటించాయి. తమిళనాడు ప్రభుత్వం వాషింగ్టన్ సుందర్‌కు రూ.75 లక్షలు ప్రకటించగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీప్తి శర్మ, విప్రజ్ నిగమ్‌లకు ఏకంగా రూ.3 కోట్ల చొప్పున బహుమతులు ప్రకటించింది.

Asian Games 2026: గోల్డ్ మెడల్ కొట్టిన క్రికెటర్లపై కాసుల వర్షం.. ఒక్కొక్కరికి ఏకంగా రూ.3 కోట్లు
Deepti Sharma

Updated on: Oct 09, 2026 | 4:20 PM

Asian Games 2026: జపాన్ వేదికగా జరిగిన ఆసియా క్రీడలు 2026లో భారత క్రికెట్ జట్లు అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించాయి. పురుషుల, మహిళల కేటగిరీలు రెండింటిలోనూ భారత్ స్వర్ణ పతకాలను సాధించి దేశ కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది. మైదానంలో అద్భుతంగా రాణించి దేశానికి పసిడి పతకాలు తెచ్చిన క్రీడాకారులను గౌరవిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భారీ నగదు బహుమతులు ప్రకటించాయి.

ఫైనల్లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన పురుషుల జట్టు

అక్టోబర్ 3న జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో భారత పురుషుల క్రికెట్ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 19 పరుగుల తేడాతో ఓడించి గోల్డ్ మెడల్ సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 211 పరుగుల భారీ స్కోరు సాధించగా, లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 192 పరుగులకే పరిమితమైంది. తమిళనాడు ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ 29 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించారు. దీనికిగానూ తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఆయనకు రూ.75 లక్షల నగదు బహుమతి ప్రకటించారు.

శ్రీలంకపై మహిళల జట్టు ఘనవిజయం

మరోవైపు భారత మహిళల జట్టు కూడా ఆధిపత్యాన్ని చాటుతూ ఫైనల్లో శ్రీలంకను ఏకంగా 147 పరుగుల తేడాతో ఘోరంగా ఓడించి పసిడి పతకాన్ని గెలుచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 216 పరుగులు చేయగా, ఛేదనకు దిగిన శ్రీలంక కేవలం 69 పరుగులకే కుప్పకూలింది. భారత స్టార్ బౌలర్ దీప్తి శర్మ అద్భుతమైన స్పెల్‌తో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

దీప్తి శర్మకు రూ.3 కోట్ల భారీ బహుమతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళా క్రికెటర్ దీప్తి శర్మ అద్భుత ప్రదర్శనకు మురిసిపోయిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆమెకు రూ.3 కోట్ల భారీ నగదు బహుమతిని ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో ఆమె చూపిన టాలెంటుకు తగిన గుర్తింపు లభించిందని క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

విప్రజ్ నిగమ్‌కు కూడా రూ.3 కోట్లు

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నజరానా కేవలం దీప్తి శర్మతోనే ఆగలేదు. గోల్డ్ మెడల్ సాధించిన భారత పురుషుల జట్టులో సభ్యుడైన యూపీ ప్లేయర్ విప్రజ్ నిగమ్‌కు కూడా రూ.3 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. ఆసియా క్రీడల్లో మన క్రికెటర్లు సాధించిన ఈ చారిత్రాత్మక విజయాలు భవిష్యత్తులో మరింత మంది యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలవనున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us