Factcheck: ఇదెక్కడి ట్విస్టు మావ.. ఇంగ్లాండ్ హెడ్ కోచ్‌గా టీమిండియా మాస్టర్ మైండ్!

భారత మాజీ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లండ్ టెస్ట్ హెడ్ కోచ్‌గా నియమితులయ్యే అవకాశాలున్నాయన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మెక్‌కల్లమ్ తప్పుకోవడంతో ఈ ప్రచారం ఊపందుకుంది. అయితే, ECBతో అశ్విన్ సమావేశం కోచింగ్‌కు కాదని, యూరోపియన్ టీ20 లీగ్‌కు సంబంధించిన వాణిజ్య చర్చల కోసమేనని తేలింది.

Factcheck: ఇదెక్కడి ట్విస్టు మావ.. ఇంగ్లాండ్ హెడ్ కోచ్‌గా టీమిండియా మాస్టర్ మైండ్!
Ashwin England's Head Coach

Updated on: Jul 13, 2026 | 9:26 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. భారత మాజీ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లండ్ టెస్ట్ జట్టు తదుపరి హెడ్ కోచ్‌గా నియమితులయ్యే అవకాశాలు ఉన్నాయని, ఈ విషయమై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB)తో ఆయన చర్చలు జరుపుతున్నారని పలు పోస్టులు ప్రచారంలోకి వచ్చాయి. అవి చూడగానే భారత క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. అంత మంచి మాస్టర్ మైండ్‌ని ఇంగ్లాండ్ ఎత్తుకుపోయే వరకు ఎందుకు చూడ్డం. మన టీమిండియాకే బౌలింగ్ కోచ్‌గా పెట్టుకుంటే పోలా అంటూ కామెంట్ చేస్తున్నారు.

మెక్‌కల్లమ్ తప్పుకోవడంతో..

ఇంగ్లండ్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న బ్రెండన్ మెక్‌కల్లమ్ ఇటీవల ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే ఆయన పూర్తిగా ఇంగ్లండ్ జట్టుకు దూరం కాలేదు. వన్డేలు, టీ20 ఫార్మాట్లలో ఇంగ్లండ్ వైట్‌బాల్ జట్లకు పర్యవేక్షకుడిగా కొనసాగనున్నారు. దీంతో టెస్ట్ హెడ్ కోచ్ పదవి ఖాళీ కావడంతో పలువురు మాజీ క్రికెటర్ల పేర్లు చర్చకు వచ్చాయి. ఇదే సమయంలో అశ్విన్ పేరు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ కావడంతో ఆయన కూడా పోటీలో ఉన్నారనే ప్రచారం మొదలైంది. ఈ క్రమంలోనే అశ్విన్ ఇటీవల అమెరికాలో ECB అధికారులను కలిశారనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఆ సమావేశాలు ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కోచింగ్‌కు సంబంధించి కాదని తెలుస్తోంది. ప్రతిపాదిత యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌కు సంబంధించిన వాణిజ్య చర్చల కోసమే ఆ సమావేశాలు జరిగినట్లు సమాచారం. కోచింగ్ నియామక ప్రక్రియతో వాటికి ఎలాంటి సంబంధం లేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

అలాగే ECB కూడా అశ్విన్‌ను టెస్ట్ హెడ్ కోచ్ పదవికి సంప్రదించలేదని, ఆయనతో ఎలాంటి చర్చలు జరగలేదని బోర్డుకు సన్నిహిత వర్గాలు స్పష్టం చేసినట్లు విదేశీ మీడియా నివేదించింది. దీంతో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాలకు ఆధారాలు లేవని తేలింది. ఇదిలా ఉండగా రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం తన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా క్రికెట్ విశ్లేషకుడిగా చురుకుగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్‌లో జరుగుతున్న భారత్ టెస్ట్ సిరీస్‌పై తన విశ్లేషణలు, అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు ఆయన ఎలాంటి అంతర్జాతీయ జట్టుకు వృత్తిపరమైన కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం లేదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us