IPL 2026: చాలా గర్వంగా ఉంది..! కొడుకు అర్జున్‌ ప్రదర్శనపై సచిన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

ఐపీఎల్‌ 2026లో లక్నో తరఫున తొలి మ్యాచ్‌ ఆడిన అర్జున్‌ టెండూల్కర్‌ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. పంజాబ్‌పై ఓటమి చెందినప్పటికీ, 4 ఓవర్లలో 36 పరుగులిచ్చి వికెట్‌ తీసి తన ప్రతిభను చాటాడు. కుమారుడి ప్రదర్శనపై సచిన్‌ భావోద్వేగ పోస్ట్‌ చేస్తూ గర్వం వ్యక్తం చేశాడు.

IPL 2026: చాలా గర్వంగా ఉంది..! కొడుకు అర్జున్‌ ప్రదర్శనపై సచిన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌
Sachin Tendulkar Arjun Tend

Updated on: May 24, 2026 | 8:33 AM

ఐపీఎల్‌ 2026లో భాగంగా శనివారం రాత్రి లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ అద్భుత విజయాన్ని సాధించింది. ప్లే ఆఫ్స్‌ రేసులో ఉండాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ కింగ్స​్‌లా ఆడారు. ముఖ్యంగా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సెంచరీతో కదం తొక్కాడు. అయితే ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టులోని యువ పేసర్‌ అర్జున్‌ టెండూల్కర్‌ మంచి ప్రదర్శన కనబర్చాడు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతూ.. ఇలాంటి బౌలర్‌నా లక్నో ఇన్ని రోజులు బెంచ్‌పై కూర్చోబెట్టింది అనిపించేలా చేశాడు.

ఇంతకీ అర్జున్‌ టెండూల్కర్‌ ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ది గ్రేట్‌, క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడు. తండ్రి బాటలోనే క్రికెట్‌ను కెరీర్‌గా మల్చుకున్న అర్జున్‌ తన శక్తిమేరా క్రికెట్‌లో గుర్తింపు కోసం పోరాటం చేస్తున్నాడు. ఈ సీజన్‌ కంటే ముందు ముంబై ఇండియన్స్‌ నుంచి లక్నోకు వచ్చాడు. కానీ అతనికి మ్యాచ్‌ ఆడే అవకాశం రాలేదు. ఏకంగా 13 మ్యాచ్‌ల పాటు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఆటగాళ్లకు డ్రింక్స్‌ మోస్తూ తన టైమ్‌ వచ్చేంత వరకు ఓపికతో వేచిచూశాడు. అయితే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి ఎప్పుడో తప్పుకున్న లక్నో ఇక పోయిదేముంది అనే టైమ్‌లో అర్జున్‌కు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటిచ్చింది.

తనను ఇంతకాలం పక్కనపెట్టి తప్పు చేశారు అనిపించేలా అర్జున్‌ మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లు కోటా పూర్తి చేసిన అర్జున్‌ కేవలం 36 పరుగులు మాత్రం ఇచ్చాడు. ఒక వికెట్‌ కూడా తీసుకున్నాడు. నిజానికి అర్జున్‌ ఖాతాలో మరో వికెట్‌ కూడా వచ్చి ఉండేది. కానీ లక్నో కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ ఓ క్యాచ్‌ను నేలపాలు చేశాడు. ఆ క్యాచ్‌ పట్టి ఉంటే అర్జున్‌కు తన తొలి ఓవర్‌లోనే అతనికి వికెట్‌ వచ్చి ఉండేది. అయినా కూడా నిరాశ చెందకుండా అద్భుతంగా బౌలింగ్‌ వేశాడు. పంజాబ్‌ బ్యాటర్లు చెలరేగి బ్యాటింగ్‌ చేస్తున్నా.. లక్నో బౌలర్లలో అందరికంటే పొదుపుగా బౌలింగ్‌ చేసింది అర్జున్‌ టెండూల్కరే. షమీ కంటే కూడా అర్జున్‌ ఎకానమీ తక్కువగా ఉండటం విశేషం.

ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతూ ఇంత మంచి ప్రదర్శన చేయడంతో తండ్రి సచిన్‌ టెండూల్కర్‌ పుత్రోత్సహాంతో పోంగిపోయారు. తన కుమారుడి ప్రదర్శనను మెచ్చుకుంటూ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. ‘వెల్‌డన్‌, అర్జున్. ఈ సీజన్ అంతా నువ్వు ప్రవర్తించిన తీరు నాకు గర్వంగా ఉంది. ఎల్లప్పుడూ నీ సామర్థ్యాన్ని నమ్ముతూ, ఓపికగా ఉంటూ, ఎవరికీ చెప్పకుండా కష్టపడి, చివరి మ్యాచ్ వరకు అవకాశం కోసం వేచి చూడాల్సి వచ్చినా సానుకూలంగా ఉన్నావు. క్రికెట్ నైపుణ్యంతో పాటు ఓపికను కూడా పరీక్షిస్తుంది, ఈ రోజు నువ్వు ఆ రెండింటినీ అద్భుతంగా నిర్వహించావు. ఎప్పుడూ ఒదిగి ఉండు, ఎప్పటిలాగే ఈ ఆటను ప్రేమిస్తూనే ఉండు. లవ్‌యూ’ అంటూ సచిన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us