IND vs ENG : వరల్డ్ కప్ వరకు ఓటమే లేదు.. ఇప్పుడేమో గెలుపే లేదు.. అయ్యర్ సేనపై మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

IND vs ENG : ఇంగ్లాండ్‌తో రెండో టీ20లో భారత్ ఓటమికి రెండు ఓవర్లే ప్రధాన కారణమని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా విశ్లేషించారు. వరల్డ్ కప్ తర్వాత వరుస పరాజయాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, మూడో టీ20లో తప్పక పుంజుకోవాలని టీమిండియాకు సూచించారు.

IND vs ENG : వరల్డ్ కప్ వరకు ఓటమే లేదు.. ఇప్పుడేమో గెలుపే లేదు.. అయ్యర్ సేనపై మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్
Aakash Chopra

Updated on: Jul 05, 2026 | 4:11 PM

IND vs ENG : ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిపాలవ్వడంపై మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటర్ ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా స్పందించారు. టీమిండియా ఓటమికి గల ముఖ్య కారణాలను ఆయన చాలా విపులంగా విశ్లేషించారు. మ్యాచ్‌లో ఒకానొక దశలో భారత్ గెలిచేలా కనిపించినప్పటికీ, బౌలర్లు వేసిన రెండు అధ్వాన్నపు ఓవర్ల వల్లే మ్యాచ్ చేజారిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ రెండు ఓవర్లలో ప్రత్యర్థి జట్టుకు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం వల్లే భారత్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఘాటుగా వ్యాఖ్యానించారు.

భారత జట్టు ప్రస్తుత ఫామ్‌పై ఆకాష్ చోప్రా ఆందోళన వ్యక్తం చేశారు. “మొన్నటి టీ20 వరల్డ్ కప్ వరకు, అంతకుముందు వరకు మనం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరుస విజయాలతో దూసుకుపోయాం. కానీ దురదృష్టవశాత్తూ ఇప్పుడు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోతున్నాం. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి, ఇంకా మన తొలి విజయం కోసం వెతుకులాడుకోవాల్సి రావడం నిజంగా బాధాకరం” అని చోప్రా అన్నారు. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఆడిన మొదటి నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారత్‌కు ఒక్కటంటే ఒక్క విజయం కూడా దక్కకపోవడం గమనార్హం.

భారత బౌలింగ్ వైఫల్యాలను ఎండగడుతూ ఆకాష్ చోప్రా కీలక గణాంకాలను బయటపెట్టారు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ మొత్తంలో కేవలం రెండు ఓవర్లలోనే ఏకంగా 56 పరుగులు వచ్చాయని ఆయన చెప్పారు. “రెండు ఓవర్లలో 56 పరుగులు ఇస్తే మ్యాచ్ అక్కడే ముగిసిపోతుంది. ఎందుకంటే డిఫెండ్ చేసుకోవడానికి మన దగ్గర 225 పరుగులు లేవు, ఉన్న స్కోరును కాపాడుకోవడమే కష్టంగా మారినప్పుడు ఇలాంటి ఓవర్లు భారీ నష్టాన్ని చేకూరుస్తాయి. ఒకానొక సమయంలో ఇంగ్లాండ్‌కు 58 పరుగులు కావాల్సినప్పుడు భారత్ మ్యాచ్‌పై పట్టు సాధించింది, కానీ ఆ తర్వాత అంతా తలకిందులైంది” అని ఆయన విశ్లేషించారు.

లండన్ టి20 మ్యాచ్‌లో అసలు ఏం జరిగింది?

మ్యాచ్ హైలైట్స్ లోకి వెళితే.. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే అర్ష్‌దీప్ సింగ్ రెండు కీలక వికెట్లు తీసి భారత్‌కు అదిరిపోయే స్టార్ట్ ఇచ్చాడు. కానీ, ఆ తర్వాత అతను వేసిన తన రెండో ఓవర్లో (ఇన్నింగ్స్ 3వ ఓవర్) ఏకంగా 27 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కోలుకుని వేగంగా పరుగులు రాబట్టాడు. ఇక ఆఖర్లో ఇంగ్లాండ్‌కు 24 బంతుల్లో 49 పరుగులు కావాల్సిన ఉత్కంఠభరిత సమయంలో.. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ వేసిన 17వ ఓవర్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఆ ఒక్క ఓవర్లోనే బిష్ణోయ్ నో-బాల్స్‌తో కలిపి 29 పరుగులు లూజ్ చేయడంతో జాకబ్ బెథెల్ మ్యాచ్‌ను ఇంగ్లాండ్ వైపునకు తిప్పేసాడు.

మూడో టీ20లోనైనా భారత్ పుంజుకుంటుందా?

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగబోయే మూడో టీ20 మ్యాచ్ వచ్చే మంగళవారం (జూలై 7) జరగనుంది. సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే శ్రేయస్ అయ్యర్ సేనకు ఈ మ్యాచ్‌లో గెలుపు అత్యంత కీలకం. ఒకవేళ ఈ మ్యాచ్‌లో కూడా భారత్ ఓడిపోతే, సిరీస్ గెలిచే అవకాశం పూర్తిగా చేజారిపోతుంది. ఆ తర్వాత మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిచినా కూడా టీమిండియా కేవలం సిరీస్‌ను డ్రా చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. మరి ఈ ఒత్తిడిని అధిగమించి యువ భారత్ ఎలా పుంజుకుంటుందో చూడాలి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us