BPL 2026 : బంగ్లాదేశ్‎లో 30 గంటల హైడ్రామాకు తెర..నేటి నుంచే మళ్లీ బీపీఎల్ షురూ

BPL 2026 : బంగ్లాదేశ్ క్రికెట్‌లో గత రెండు రోజులుగా రేగిన పెను ఉప్పెన ఎట్టకేలకు శాంతించింది. బోర్డు ఉన్నతాధికారుల తీరుపై నిప్పులు చెరుగుతూ ఆటగాళ్లు సాగించిన తిరుగుబాటు సుఖాంతమైంది. దీంతో అర్ధాంతరంగా ఆగిపోయిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ మళ్లీ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. అసలు ఈ 30 గంటల్లో బంగ్లాదేశ్ క్రికెట్‌లో ఏం జరిగింది? ఆటగాళ్లు ఎందుకు అంతలా రగిలిపోయారు? తెలుసుకుందాం.

BPL 2026 : బంగ్లాదేశ్‎లో 30 గంటల హైడ్రామాకు తెర..నేటి నుంచే మళ్లీ బీపీఎల్ షురూ
Bpl 2026

Updated on: Jan 16, 2026 | 11:36 AM

BPL 2026 : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ నజ్ముల్ ఇస్లాం చేసిన ఒక వివాదాస్పద వ్యాఖ్య దేశంలో పెను దుమారాన్ని రేపింది. టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో భారత్, ఐసీసీతో ఇప్పటికే ఘర్షణ పడుతున్న బంగ్లా బోర్డుకు, సొంత ఆటగాళ్లే షాక్ ఇచ్చారు. జనవరి 14వ తేదీన మొదలైన ఈ గొడవ, గురువారం అర్థరాత్రి వరకు కొనసాగింది. బోర్డు తమను అవమానిస్తోందని, ఆటగాళ్ల ప్రదర్శనను తక్కువ చేసి మాట్లాడుతోందని సీనియర్ ప్లేయర్లు లీగ్‌ను బహిష్కరించారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో బోర్డు దిగివచ్చి సదరు అధికారిపై చర్యలు తీసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.

జనవరి 14 మధ్యాహ్నం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బోర్డు డైరెక్టర్ నజ్ముల్ ఇస్లాం చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేసాయి. “వరల్డ్ కప్ ఆడకపోతే బోర్డుకు వచ్చే నష్టం ఏమీ లేదు, కేవలం ఆటగాళ్లకే మ్యాచ్ ఫీజులు రావు. ఇప్పటికే వారిపై కోట్లాది రూపాయలు ఖర్చు చేశాం.. కానీ వారు ఇస్తున్న ప్రదర్శన ఏమీ లేదు. బోర్డు ఏమైనా ఆ డబ్బును తిరిగి అడుగుతోందా?” అంటూ ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ మాటలు విన్న వెంటనే బంగ్లాదేశ్ క్రికెట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్లేయర్లు ఏకమయ్యారు. నజ్ముల్‌ను బోర్డు నుంచి తొలగించకపోతే ఏ టోర్నీలోనూ ఆడేది లేదని తేల్చి చెప్పారు.

ఆటగాళ్ల హెచ్చరికను బోర్డు మొదట తేలికగా తీసుకుంది. కానీ జనవరి 15న జరగాల్సిన మొదటి బీపీఎల్ మ్యాచ్‌కు ఆటగాళ్లు రాకపోవడంతో బోర్డుకు అసలు విషయం అర్థమైంది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. నజ్ముల్ ఇస్లాంకు 48 గంటల షోకాజ్ నోటీసు ఇచ్చి చేతులు దులుపుకోవాలని బోర్డు చూసినా, ఆటగాళ్లు మాత్రం తగ్గలేదు. సీనియర్ ఆటగాళ్లంతా కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తమ డిమాండ్లను మరోసారి వినిపించారు. దీంతో చేసేదేమీ లేక రెండో మ్యాచ్‌ను కూడా రద్దు చేసి, లీగ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశ్ క్రికెట్ పరువును తీసింది.

వివాదం ముదురుతుండటంతో బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నజ్ముల్ ఇస్లాంను ఫైనాన్స్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తొలగించింది. ఈ నిర్ణయంతో ఆటగాళ్లు కొంత శాంతించారు. గురువారం రాత్రి 11:45 గంటల సమయంలో ప్లేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ మిథున్, బోర్డు ప్రతినిధులు సంయుక్తంగా ప్రకటన చేశారు. దేశ క్రికెట్ ప్రయోజనాల దృష్ట్యా తాము సమ్మె విరమిస్తున్నామని, మళ్లీ మైదానంలోకి దిగుతామని ప్లేయర్లు ప్రకటించారు. నేటి నుంచి (జనవరి 16) బీపీఎల్ మ్యాచ్‌లు యథావిధిగా సాగనున్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..