
Virender Sehwag: భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ తనదైన దూకుడుతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన బాటలోనే ఆయన కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా క్రికెట్ ప్రపంచంలో అడుగుపెట్టి తన సత్తా చాటుతున్నాడు. జూనియర్ క్రికెట్ నుంచి అండర్-19 స్థాయికి ఎదిగిన ఆర్యవీర్, తాజాగా ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్‌లో మొత్తం 109 పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా 100కు పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి తన తండ్రిని పోలిన దూకుడును ప్రదర్శించాడు.
కొడుకు కోసం వీరేంద్ర సెహ్వాగ్ ఇచ్చిన సలహా
తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్న తన కుమారుడికి వీరేంద్ర సెహ్వాగ్ ఒక అత్యంత విలువైన సలహా ఇచ్చారట. మైదానంలో ఆడేటప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురికావద్దని, కేవలం స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాలని సూచించారు. పెద్ద పెద్ద పరుగులు చేయాలనే ఆలోచనను పక్కనపెట్టి, కేవలం తన సహజమైన ఆటను ఆస్వాదించాలని చెప్పినట్లు సెహ్వాగ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒకవేళ నువ్వు కేవలం పరుగుల గురించే ఆలోచిస్తే ఒత్తిడి పెరిగి అనుకున్న విధంగా రాణించలేవని తన కొడుకుతో స్పష్టంగా చెప్పినట్లు ఆయన తెలిపారు.
ప్రజలు నిన్ను ద్వేషిస్తారు, ప్రేమిస్తారు
క్రికెటర్లుగా ఎదిగే క్రమంలో క్రీడాకారులు ప్రశంసలతో పాటు విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని సెహ్వాగ్ తన కుమారుడికి నూరిపోశారు. “ప్రజలు నిన్ను ప్రేమిస్తారు, నీపై విమర్శలు గుప్పిస్తారు, చివరికి నిన్ను ద్వేషిస్తారు కూడా. కానీ నువ్వు వాటికి ఎలాంటి స్పందన ఇవ్వాల్సిన అవసరం లేదు” అని సెహ్వాగ్ ఆర్యవీర్‌కు హితవు పలికారు. ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారనే దానికంటే, నీ ఆటతీరు మెరుగుపరుచుకోవడంపైనే పూర్తి దృష్టి పెట్టాలని ఆయన స్పష్టం చేశారు. ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడనివ్వాలని, నువ్వు మాత్రం నీ ప్రాక్టీస్, ఆటపైనే శ్రద్ధ పెట్టాలని కొడుకును ప్రోత్సహించారు.
సలహాను తూచా తప్పకుండా పాటించిన ఆర్యవీర్
తండ్రి చెప్పిన మాటలను ఆర్యవీర్ సెహ్వాగ్ ఎంతో సీరియస్‌గా తీసుకుని మైదానంలో అద్భుతంగా రాణించాడని వీరేంద్ర సెహ్వాగ్ సంతోషం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆర్యవీర్ జట్టుకు మంచి ఆరంభాలను అందించాడు. హాఫ్ సెంచరీ చేజారినప్పటికీ చివరి మ్యాచ్‌లో 47 పరుగులతో రాణించి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. తండ్రి ఇచ్చిన మానసిక స్థైర్యం, సలహాలే తన కొడుకును మైదానంలో నిలకడగా ఆడేలా చేస్తున్నాయని సెహ్వాగ్ గర్వంగా తెలిపారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..