Shravana Masam 2022: లయకారుడు భోళాశంకరుడు శివయ్య అనుగ్రహం పొందిన వ్యక్తి కష్టాల నుంచి తేలికగా గట్టెక్కుతాడు. నమ్మి మనస్ఫూర్తిగా కోరి కొలిస్తే.. జలంతో అభిషేకించిన చాలు భక్తుల కోరిన కోర్కెలు తీర్చే భక్తవ శంకరుడు. శ్రావణ మాసంలో శివుడిని పూజకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. శాస్త్రాల ప్రకారం శ్రావణ మాసం పరమశివునికి ఎంతో ప్రీతికరమైనదని.. ఈ పవిత్ర మాసంలో ఆయనను పూజించడం విశేష ఫలితాలను ఇస్తుందని నమ్మకం. శ్రావణ మాసం జూలై 29 నుండి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో శివుని భక్తులు వారిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలతో పాటు ఉపవాసం ఉంటారు, కొందరు హరిద్వార్ వెళ్లి శివుడికి గంగాజలంతో అభిషేకం చేస్తారు. శివునికి జలాభిషేకం చేయడం శుభఫలితాలను ఇస్తుందని గ్రంథాలలో ఉంది.
శివలింగానికి జలాభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం, సంతానం, ఇతర సుఖాలు కలుగుతాయి. ఈ రోజు శివుడికి శ్రావణ మాసంలో నీరు కాకుండా ఏ వస్తువులను సమర్పించవచ్చో తెలుసుకుందాం. ఈ వస్తువులు కూడా శివునికి చాలా ప్రీతికరమైనవి.. వాటిని సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
పాలతో శివుని అభిషేకం
శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన వాటిలో పాలు ఒకటి అని నమ్ముతారు. చాలా మంది భక్తులు నీటి తర్వాత శివుడికి పాలు సమర్పిస్తారు, ఎందుకంటే పాలు చాలా పవిత్రమైనవి. శివునికి పాలతో అభిషేకం చేయడం ద్వారా ప్రసన్నుడై తన భక్తులపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడని నమ్మకం. పాలతో అభిషేకం చేయడం వలన పనుల్లో ఆటంకాలు తొలగిపోయి ధననష్టం ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది.
పండ్ల రసంతో శివుని అభిషేకం
శ్రావణ మాసంలో పండ్ల రసంతో శివునికి అభిషేకం చేయడం అత్యంత ఫలప్రదం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారంఈ మాసంలోని ప్రతి సోమవారం, తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి.. తాజా పండ్లతో కూడిన ఆపిల్.. ఇతర రసాలను శివలింగానికి సమర్పించండి. ఈ సమయంలో మీరు జలాభిషేకం కూడా చేయాల్సి ఉంటుంది. ఈ జ్యోతిష్య పరిహారాన్ని పాటించడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
శనగపప్పు నైవేద్యం:
శివుడికి పప్పు నైవేద్యంగా పెట్టడం వల్ల అప్పుల బాధ త్వరగా తీరతాయని నమ్మకం. మీరు కూడా అప్పుల భారంలో ఉన్నట్లయితే, ఉదయాన్నే శ్రావణ మాసంలో శివుడికి శనగపప్పు సమర్పించండి. అంతేకాదు మీ కుటుంబంలో సంతోషం, శాంతి కోసం శివుడిని ప్రార్థించండి. శివుడు అభిషేక ప్రియుడు.. ఆయన సంతోషిస్తే.. మీ జీవితంలో సుఖసంతోషాలు ఎల్లప్పుడూ ఉంటాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు , నమ్మకం పై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)