
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శతజయంతి సందర్భంగా వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ ఆధ్వర్యంలో సత్య సాయి గ్రామం సాయిరామ నామస్మరణతో మారుమోగింది. సద్గురు శ్రీ మధుసూదన్ సాయి నేతృత్వంలో ఆగస్టు 16 నుంచి నవంబర్ 23 వరకు 100 రోజులపాటు నిర్వహించిన వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్–2025 అద్భుత విజయాన్ని అందుకుంది. ప్రపంచంలోనే సుదీర్ఘంగా సాగిన ఈ సాంస్కృతిక ఉత్సవం గిన్నిస్ రికార్డు సృష్టించింది. 100 దేశాలు ఒకే వేదికపై తమ కళలు, సంగీతం, నృత్యం, సంస్కృతి, సేవా కార్యక్రమాలతో మానవత్వాన్ని ఏకం చేస్తూ భగవాన్ శ్రీ సత్య సాయి బాబాకు ఘన నివాళి అర్పించాయి.
ఈ ఉత్సవంలో 100 మంది మానవతావాదులు, 140కిపైగా సామాజిక సేవలో పాల్గొనే కార్పొరేట్ సంస్థలు, 45కు పైగా గ్లోబల్ థాట్‌లీడర్లు, మీడియా, జర్నలిజం, న్యాయరంగంలోని అనేకమంది ప్రతిభావంతుల్ని సత్కరించారు. భగవాన్ బాబా సందేశమైన “అందరిని ప్రేమించు – అందరిని సేవించు” సారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మిషన్ పోషణ, విద్య, ఆరోగ్య రంగాల్లో పలు చారిత్రాత్మక కార్యక్రమాలను ప్రారంభించింది. దేశ సేవార్థం 126 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఉచిత ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి (600 పడకలు) త్వరలో ప్రారంభమై ప్రజల సేవకు అంకితం కాబోతోంది. అందరికీ సమాన ఆరోగ్య హక్కులు అందించడంలో ఇది ఒక మైలురాయి.
శతజయంతి వేడుకల్లో భాగంగా 60 దేశాల నుంచి వచ్చిన 450 మంది సంగీత విద్వాంసులు సాయంత్రం సాయి కృష్ణన్ క్రికెట్ స్టేడియంలో అద్భుత ప్రదర్శన ఇచ్చారు. ఆదివారం ఉదయం జరిగిన ప్రధాన వేడుకల్లో ఫిజీ అధ్యక్షుడు రటు నఖిమా లలా బలావు, వెటరన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్, అరవింద డిసెల్వా తదితర ప్రముఖులు హాజరయ్యారు.
“గురువు ఆదేశాలను ఆచరిస్తూ జీవించడమే గురువుకు అందించే ఉత్తమ గురుదక్షిణ. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా నిత్యసత్యం. ఆయనకు జననమరణాలు లేవు. ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు. ఆయన అనుగ్రహం లేకుండా ఇన్ని సేవా కార్యక్రమాలు సాధ్యం కాదు” అని సద్గురు శ్రీ మధుసూదన్ సాయి పేర్కొన్నారు.
వివిధ దేశాలు, మతాలు, సంప్రదాయాలకు చెందిన ఆధ్యాత్మిక నాయకులు, పండితులు ఈ మహోత్సవానికి హాజరై మాట్లాడుతూ “ఏకత్వమే దైవత్వం, పవిత్రతే జ్ఞానం” అనే భగవాన్ బాబా బోధనను మళ్లీ గుర్తు చేశారు. సాయంత్రం సాయి కృష్ణన్ స్టేడియంలో జరిగిన సాయి సింఫనీ ఆర్కెస్ట్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 60 దేశాల సంగీత కళాకారులు, సత్యసాయి లోక సేవా గురుకులం విద్యార్థులైన 200 మంది కలిసి 450 మంది కళాకారులతో చేసిన ఈ ప్రదర్శన ప్రపంచ చరిత్రలోనే తొలిసారి చోటుచేసుకుంది. నభూతో నభవిష్యత్‌గా నిలిచిన ఈ సంగీత యజ్ఞం భగవాన్ శ్రీ సత్య సాయి బాబాకు అద్భుత నివాళిగా మారింది.