బీహార్ , ఉత్తరప్రదేశ్‌లలో ప్రవహించే ఈ నది పేరు కర్మనాశ నది. కర్మ అంటే పని మరియు నాశ అంటే నాశనం అనే అర్ధం వచ్చే విధంగా ఈ నదిని ఈ రెండు పదాల కలయికతో రూపొందించబడిందని పురాణాల కథనం. పురాణాల్లో ఈ నది గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ నదికి సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ కర్మనాశ నది చివరికి పవిత్ర గంగా నదిలో కలుస్తుంది. అయితే ఈ నది చరిత్ర ఏమిటి ? దానిని ఎందుకు శాప గ్రస్త నదిగా పరిగణిస్తారు ఈ రోజు తెలుసుకుందాం..
కర్మనాశ నది బీహార్‌లోని కైమూర్ జిల్లాలో ఉద్భవించి ఉత్తరప్రదేశ్‌లో ప్రవహిస్తూ.. చివరికి పవిత్ర గంగానదిలో కలుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ నది బీహార్, యుపిలను కూడా విభజిస్తుంది. కర్మనాశ నది ఉత్తరప్రదేశ్‌లోని సోనభద్ర, చందౌలీ, వారణాసి, ఘాజీపూర్ గుండా ప్రవహిస్తుంది.
పురాణం ప్రకారం హరిశ్చంద్ర రాజు తండ్రి సత్యవ్రత చాలా ధైర్యవంతుడు. అతని గురువు వశిష్ఠుడు. సత్యవ్రతుడు తన గురువైన వశిష్ఠుని ఓ వరం కోరాడు. భౌతికంగా స్వర్గానికి వెళ్లాలనే కోరికను గురువు వశిష్ఠునికి తెలియజేశాడు. అయితే సత్యవ్రతుడి కోరిక తీర్చడానికి గురువు వశిష్ఠుడు నిరాకరించాడు. ఎలాగైనా బొందితో స్వర్గానికి అంటే ప్రాణం ఉన్నప్పుడే స్వర్గానికి వెళ్ళాలనే కోరిక తీర్చని వశిష్టుడి మీద సత్యవ్రతుడు కోపించి ఎలాగైనా సరే స్వర్గానికి వెళ్ళాలనే కోరికతో విశ్వామిత్రుని వద్దకు చేరుకున్నారు. విశ్వామిత్రుడికి.. వశిష్ఠుడు అంటే అసూయ, అకారణ శత్రుత్వం కారణంగా.. వశిష్టుడు కాదన్న రాజు సత్యవ్రత్రుడి కోరికను తీర్చడానికి విశ్వామిత్రుడు అంగీకరించాడు. తన తపశ్శక్తి ని ఉపయోగించి సత్యవ్రత్రుడిని స్వర్గానికి పంపడానికి రెడీ అయ్యాడు. విశ్వామిత్రుడు తన తపస్సు బలంతో సత్యవ్రతుడిని స్వర్గానికి చేరుకునేలా చేసాడు. అది చూసిన ఇంద్రుడు కోపించి స్వర్గం నుంచి సత్యవ్రతుడిని భూమి మీదకు తోసేశాడు. అప్పుడు సత్యవ్రతుడు తలక్రిందులుగా భూలోకానికి వస్తున్న రాజుని విశ్వామిత్రుడు తన తపస్సుతో స్వర్గానికి, భూమికి మధ్య అడ్డుకున్నాడు. దీనిని త్రిశంక స్వర్గం అని పిలుస్తారు.
దేవతలకు, విశ్వామిత్రునికి మధ్య జరిగిన యుద్ధంలో త్రిశంకుడు భూమి..ఆకాశంలో తలక్రిందులుగా వేలాడుతున్న సమయంలో అతని నోటి నుండి లాలాజలం వేగంగా కారడం ప్రారంభించింది. ఈ లాలాజలం నది రూపంలో భూమిపై ప్రవహించడం మొదలైంది. వశిష్ఠ మహర్షి రాజును శపించాడని ..అతని లాలాజలం నుంచి ఏర్పడిన నది కనుక కర్మనాశ నది అని .. శాపగ్రస్త నది అని పిలుస్తారు.
ఈ నది నీటిని తాకడం వల్ల పనులు చెడిపోతాయని, మంచి పనులు కూడా మట్టిలో కలిసిపోతాయని నమ్ముతారు. అందుకే ఈ నది నీటిని ప్రజలు ముట్టుకోరు. అలాగే ఏ పని కోసం ఉపయోగించరు.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.