శివుని ‘కాశీ’లో విష్ణుమూర్తి ఎందుకు కొలువై ఉన్నారు? వెయ్యేళ్ల నాటి బిందు మాధవ ఆలయ రహస్యం తెలుసా?

Bindu Madhav Temple Varanasi History Telugu: కాశీ నగరంలోని పంచగంగా ఘాట్ సమీపంలో కొలువైన బిందు మాధవ ఆలయానికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. అగ్నిబిందు మహర్షి తపస్సు, విష్ణుమూర్తి ఇచ్చిన వరం ఈ క్షేత్రం వెనుక ఉన్న ఆసక్తికరమైన పురాణ గాథలు. ముఖ్యంగా కార్తీక మాసంలో ఇక్కడ నిర్వహించే ప్రత్యేక పూజలు, దీపారాధనలు, వైకుంఠ అభిషేకం విశేష ఆకర్షణగా నిలుస్తాయి.

శివుని ‘కాశీ’లో విష్ణుమూర్తి ఎందుకు కొలువై ఉన్నారు? వెయ్యేళ్ల నాటి బిందు మాధవ ఆలయ రహస్యం తెలుసా?
Bindu Madhav Temple Varanasi

Updated on: Nov 28, 2026 | 5:29 PM

Bindu Madhav Temple Varanasi History Telugu: హిందూ మతంలో కార్తీక మాసానికి, వైకుంఠ చతుర్దశికి ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున శివకేశవులను కలిపి పూజించడం అత్యంత శుభప్రదమని భక్తుల విశ్వాసం. దీనినే హరి-హరుల కలయికగా అభివర్ణిస్తారు. ఈ సందర్భంగా కాశీలోని విష్ణుమూర్తికి అంకితం చేయబడిన ఓ ప్రాచీన ఆలయం గురించి తెలుసుకుందాం. అదే బిందు మాధవ ఆలయం. ఈ ఆలయం వెనుక ఆసక్తికరమైన పురాణ గాథలు, విశిష్టమైన సంప్రదాయాలు ఉన్నాయి.

బిందు మాధవ ఆలయ పురాణ గాథ

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి (కాశీ)లో పంచగంగా ఘాట్ సమీపంలోని ఘాసి టోలా ప్రాంతంలో బిందు మాధవ ఆలయం కొలువై ఉంది. పురాణాల ప్రకారం, అగ్నిబిందు మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేస్తూ విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకున్నారు. తన తపస్సుకు మెచ్చి స్వామి ఇక్కడే శాశ్వతంగా నివసించాలని ఆయన వరం కోరారు. అందుకు విష్ణుమూర్తి అంగీకరించడంతో ఈ క్షేత్రం బిందు మాధవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.

మరో కథనం ప్రకారం, బిందు మహర్షి నేపాల్‌లోని గండకి నది ఒడ్డున తపస్సు చేస్తుండగా విష్ణుమూర్తి ప్రత్యక్షమై కాశీలో తన పేరుతో ఆలయం నిర్మించాలని ఆదేశించారట. గండకి నది మట్టితో చేసిన విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాలని సూచించారట. ఈ ఆలయ ప్రస్తావన కాశీ ఖండంలోనూ ఉన్నట్లు చెబుతారు.

ఇవి కూడా చదవండి

బిందు మాధవ ఆలయం ప్రత్యేకత ఏమిటి?

కాశీలోని ప్రాచీన విష్ణు క్షేత్రాల్లో బిందు మాధవ ఆలయానికి విశిష్టమైన స్థానం ఉంది. ఈ ఆలయం సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినదిగా చెబుతారు. ఇక్కడ విష్ణుమూర్తి శాలిగ్రామ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారి ఇరువైపులా గరుడుడు, హనుమంతుడి విగ్రహాలు ఉంటాయి.
కాశీ ఖండం ప్రకారం, ఈ ప్రాంతానికి శివకేశవులతో విడదీయలేని సంబంధం ఉంది. మణికర్ణిక ఘాట్ నుంచి ఆదికేశవ ఘాట్ వరకు ఉన్న ప్రాంతాన్ని విష్ణు కాశీగా, మణికర్ణిక నుంచి అస్సీ ఘాట్ వరకు ఉన్న ప్రాంతాన్ని శివ కాశీగా పిలుస్తారనే నమ్మకం ఉంది.

కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు

కార్తీక మాసంలో బిందు మాధవ ఆలయంలో ప్రత్యేక పూజలు, దీపారాధనలు నిర్వహిస్తారు. భక్తులు బ్రహ్మ ముహూర్తంలో పంచగంగా ఘాట్‌లో పవిత్ర స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు. దీపాలు వెలిగించి తులసి దళాలతో పూజలు చేస్తారు. ఇలా భక్తిశ్రద్ధలతో స్వామిని ఆరాధిస్తే పాపాలు తొలగి, జన్మరాహిత్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

ఈ మాసంలో తెల్లవారుజామున 4 గంటలకు మంగళహారతి నిర్వహిస్తారు. తులసి వివాహం అనంతరం ద్వాదశి రోజున స్వామివారిని గుర్రంపై ఊరేగిస్తారు. త్రయోదశి నాడు జూలన్ సేవ నిర్వహించి, రాత్రి వైకుంఠ అభిషేకం చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజున ఏనుగు వాహనంపై స్వామివారి ఊరేగింపు నిర్వహిస్తారు. పంచామృత అభిషేకం అనంతరం 56 రకాల వంటకాలతో మహా నైవేద్యం సమర్పిస్తారు.

శివుడి నగరమైన కాశీలో విష్ణుమూర్తి కొలువైన ఈ బిందు మాధవ క్షేత్రం హరిహరుల ఐక్యతకు ప్రతీకగా భక్తులు భావిస్తారు. కార్తీక మాసంలో ఈ ఆలయాన్ని దర్శించుకోవడం విశేష పుణ్యప్రదమని నమ్ముతారు.

(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న ఆలయ చరిత్ర, పురాణ గాథలు, ఆధ్యాత్మిక విశేషాలు హిందూ మత గ్రంథాలు, సంప్రదాయాలు, భక్తుల విశ్వాసాల ఆధారంగా అందించబడ్డాయి. వీటిని భక్తి, ఆధ్యాత్మిక విశ్వాసాల కోణంలో మాత్రమే చూడగలరు.)

Loading...
Unable to load recommendations.
Follow Us