కంగనాను ఆడిపోసుకుంటున్న బాలీవుడ్‌ తారలు, కంగనాకు బాసటగా నిలిచిన రామ్‌దాస్‌

సాహసమో తెగింపో తెలియదు కానీ బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ఒక్క అంగుళం కూడా తగ్గడం లేదు.. అదే స్టాండ్‌, అదే ఫైర్‌! ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న లెక్కలేనితనం! ఇప్పుడు కంగనా ముంబాయిలో ప్రకంపనలు రేపుతున్నది..

కంగనాను ఆడిపోసుకుంటున్న బాలీవుడ్‌ తారలు, కంగనాకు బాసటగా నిలిచిన రామ్‌దాస్‌
Follow us

|

Updated on: Sep 05, 2020 | 1:02 PM

సాహసమో తెగింపో తెలియదు కానీ బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ఒక్క అంగుళం కూడా తగ్గడం లేదు.. అదే స్టాండ్‌, అదే ఫైర్‌! ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న లెక్కలేనితనం! ఇప్పుడు కంగనా ముంబాయిలో ప్రకంపనలు రేపుతున్నది.. ముంబాయిని పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చినందుకు తోటి సినిమా తారలు, రాజకీయవేత్తలు, సామాజికకార్యకర్తలు ఇలా అందరూ కంగానను నానా మాటలు అనడం మొదలు పెట్టారు.. కేంద్రమంత్రి, రిపబ్లిక్‌పార్టీ నాయకుడు రామ్‌దాస్‌ అతవాలే మాత్రం కంగనా రనౌత్‌కు సపోర్ట్‌గా నిలిచాడు.. కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలేమిటో తెలియదు కానీ శివసేన పార్టీ ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ మాత్రం ఓ సినీనటిని ఉద్దేశించి అలా మాట్లాడటం మాత్రం మంచిది కాదన్నారు.. కంగనా చేస్తున్న పోరాటంలో తాము ఆమె కుటుంబానికి అండగా నిలుస్తామని రామ్‌దాస్‌ అతవాలే చెప్పారు..

రామ్‌దాస్‌ తప్ప అందరూ కంగనాను లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ తీసుకుంటున్నారు.. శివసేన మహిళా విభాగం నేతలైతే కంగనాకు వ్యతిరేకంగా నిరసనలే చేపట్టారు.. అంతేనా.. ఆమె పోస్టర్‌పై చెప్పులతో దాడి చేశారు.. ఇలా చేయడం ఎవరికీ నచ్చలేదు.. ఆఖరికి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ భార్య అమృతకు కూడా నచ్చలేదు.. ముంబాయిపై కంగనా చేసిన కామెంట్లను తాము కూడా సమర్థించడం లేదని, ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉందని అమృత చెబుతూ కంగనా పోస్టర్‌పై చెప్పులతో దాడి చేయడం మాత్రం హేయమైన చర్య అని అన్నారు..

ఇక ముంబాయి నగరాన్ని పీఓకేతో పోల్చిన కంగనాకు కొందరు క్లాస్‌ తీసుకున్నారు.. కొందరు తిట్టిపోశారు.. కొందరు ఇన్‌డైరెక్ట్‌గా విమర్శించారు.. కరోనా కాలంలో ఎంతో మందికి అండగా నిలిచి అన్నం పెట్టిన నటుడు సోనూ సూద్‌ అయితే ముంబాయిని శ్లాఘించారు. ముంబాయి తలరాతలను మారుస్తందని, ఈ నగరానికి నమస్కారం చేస్తే పురస్కారమే లభిస్తుందని ట్వీట్ చేశారు.. రితేశ్‌ దేశ్‌ముఖ్‌ అయితే ముంబాయి ఇండియాలోనే ఉందంటూ వ్యంగంగా కంగనాను విమర్శించారు. చత్రపతి శివాజీ మహారాజు ఏలిన నేల మహారాష్ట్ర అని, లక్షలాది మందికి తిండి పెట్టిన నేలని, పేరు ప్రతిష్టలను ఇచ్చిన భూమి అని, కృతజ్ఞతలు లేనివారే ఈ నగరాన్ని పీఓకేతో పోలుస్తారని చెప్పుకొచ్చారు ఊర్మిళా మంతోడ్కర్‌. కంగనా వ్యాఖ్యలతో షాక్‌తో పాటు అసహనానికి గురయ్యానని, జరిగిందేదో జరిగిపోయింది, ముంబాయి మనందరిదీ అని అన్నారామె!

దియా మీర్జా ముంబాయి గొప్పదనాన్ని వివరించారు. ముంబాయంటే తనకు ప్రాణమని, 19 ఏళ్ల వయసులో ఇక్కడికి వచ్చానని, రెండు దశాబ్దాల పాటు ఇక్కడే ఉన్నానని, ఇక్కడే పని చేశానని దియా మీర్జా కామెంట్‌ చేశారు.. ఈ నగరం తనను చేతులు చాచి దగ్గరకు తీసుకున్నదని, రక్షణనిచ్చిందని, ఈ విశ్వనగరం భిన్నమైనది, అందమైనది, అందరిని కలుపుకునిపోతుంది అని పేర్కొన్నారు దియా. ఎప్పుడూ వివాదాల్లో ఉండే స్వరభాస్కర్‌ కూడా కంగనాను విమర్శిస్తూ ముంబాయి పోలీసులను ప్రశంసించారు. మరో నటి రేణుకా సహానే కూడా కంగనాకు తలంటారు.. బాలీవుడ్‌ స్టార్‌ కావాలన్న నీ ఆశలను నేరవేర్చిన నగరం ముంబాయే అన్న సంగతి మర్చిపోకూడదని, ఈ నగరం పట్ల కొంచెం గౌరవం ఇవ్వడం నేర్చుకోమని హితవు చెప్పింది.

ఇక సోనమ్‌కపూరేమో నర్మగర్భమైన వ్యాఖ్యలు చేసింది. చాలా రోజుల కింద నేర్చుకున్న జార్జ్‌ బెర్నార్డ్‌ షా కొటెషన్‌ను ట్వీట్‌ చేసింది. ఎప్పుడు కూడా బురదలో పందితో కుస్తీ చేయకూడదని, దాని వల్ల మీకే మురికి అంటుతుందని, దానికి బురద అంటే ఇష్టమని చెప్పింది సోనమ్‌ కపూర్‌.. ఈ ట్వీట్ కంగ‌నాను ఉద్దేశించి చేసిందా అన్న అనుమానాలు నెటిజ‌న్స్‌లో మొద‌ల‌య్యాయి. ఇందరు ఇంతలేసి మాటలంటున్నా కంగనా మాత్రం లైట్‌ తీసుకుంటోంది.. పైగా తొమ్మిదిన తాను ముంబాయికి వస్తున్నానని, ఏం చేసుకుంటారో చేసుకోండని సవాల్‌ విసురుతోంది.. ఈ వివాదానికి శివసేన ఇంతటితో ముగింపు పలుకుతుందా ? లేక కంగనానే కాంప్రమైజ్‌ అవుతుందా అన్నది చూడాలి..!