
బాలీవుడ్ సెలెబ్రిటీస్ కు బీజేపీ గాలం వేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఊర్మిళా మటోండ్కర్ కి ‘తాయిలం’ ఇస్తే.. తామేం తక్కువ తినలేదంటూ కాషాయనాథులు కూడా అదే పనిలో పడ్డారు. తాజాగా బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ తో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా భేటీ కావడం విశేషం. పార్టీలో సన్నీ చేరబోతున్నాడన్న వార్తలు జోరందుకుంటున్నాయి. పైగా ఈ లోక్సభ ఎన్నికల్లో ఆయన బీజేపీ పార్టీ తరపున పోటీ చేయనున్నట్లు సమాచారం. పూణేలోని సన్నీ డియోల్ ఫామ్ హౌస్ లో అమిత్ షా శుక్రవారం సాయంత్రం సమావేశమయ్యారు. పంజాబ్ లోని మూడు లోక్ సభ స్థానాలకు బీజేపీ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించని నేపధ్యంలో పార్టీ ప్రతిష్టకు కీలకంగా భావిస్తున్న అమృత్ సర్ నుంచి సన్నీని పోటీకి దింపాలని ఆయన భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
బీజేపీ నేత తరుణ్ రాఠీ శుక్రవారం సాయంత్రం తన ట్విట్టర్ వాల్ పై ఒక ఫోటో పోస్ట్ చేశారు. అందులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రియ మిత్రుడు సన్నీ డియోల్ తో కలిసి లోక్ సభ ఎన్నికలపై చర్చించానని ఆయన పేర్కొన్నారు