
హైదరాబాద్: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పార్టీలు మారే వాళ్లు ఒకవైపు అయితే, ఇంకోవైపు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఎవరి వ్యూహాలు వాళ్లు అమలు చేసుకుంటూ అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల మధ్యే తీవ్ర పోటీ నెలకొంది.
వైసీపీలో చేరుతున్న వారిలో సినిమా వాళ్లు ఎక్కువగా ఉంటున్నారు. మరి సినీ గ్లామర్ జగన్‌కు ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాల్సిందే. ఏప్రిల్ 11న ఓటింగ్ ఉండటంతో ఎవరికి వారు స్పీడ్ పెంచారు. వీటన్నింటి మధ్యలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీకి ప్రత్యేక ఆకర్షణ లభించింది.
ఈ మూవీపై పలువురు పలు వాదనలు వినిపిస్తున్నారు. టీడీపీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా సినిమా ఉంటుందని అది కచ్చితంగా టీడీపీకి నష్టం చేకూరుస్తుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. స్వయంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ మీద, టీడీపీ పార్టీ మీద దుష్ట చతుష్టయం కలిసి కుట్రలు చేస్తున్నారని, తనను విలన్‌గా చూపించాలని చూస్తున్నారంటూ విమర్శలు చేశారు.
వీటన్నింటి నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ గురించి ఒక టాక్ జనాల్లో బాగా వినిపిస్తుంది. ఈ మూవీ ప్రభావం ఏపీ ఎన్నికలపై బాగా ఉంటుందని, అది చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉంటుదనే చర్చ నడుస్తోంది. ప్రతి విషయాన్నీ తన సినిమాల పబ్లిసిటీలకు వాడుకునే వర్మ ఈ యాంగిల్‌ను కూడా వాడారు. సోషల్ మీడియాలో ఈ మేరకు ఒక పోలింగ్ పోస్ట్ పెట్టారు.
“లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమా విడుదల వల్ల ఏపీలో ఎన్నికల ఫలితాలు ప్రభావితం అవుతాయా? అంటూ ప్రశ్నించారు. ఇందులో నెటిజన్లు ఎక్కువగా ప్రభావితం అవుతాయనే ఓటు వేశారు. 71 శాతం మంది అవును ప్రభావితం అవుతాయని అనగా, 29 శాతం మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. సినిమా ప్రభావం ఓటింగ్‌పై ఉంటుందా? లేదా? అనేది తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే.
Will #LakshmisNTR release, effect the result of Andhra Pradesh Election ?
— Ram Gopal Varma (@RGVzoomin) March 12, 2019
ఎన్నికలు ముగిసినప్పటికీ ఆ విషయం మాత్రం అలానే ప్రశ్నార్ధకంగా ఉండే అవకాశం కూడా ఉంది. సినిమాల ప్రభావం రాజకీయాల్లో ఉండదని, అసలు ఎన్టీఆర్ విషయంలో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసని టీడీపీ నేతలు అంటున్నారు. ఎన్టీఆర్ ఎపిసోడ్ తర్వాత కూడా చంద్రబాబును ప్రజలు అంగీకరించారని వారు వాదిస్తున్నారు.