Undavalli Arunkumar on Bharath Bundh : మనకెందుకులే అని అందరూ వదిలిస్తే భవిష్యత్తులో పేదల గురించి మాట్లాడేవారిని కాల్చి చంపేసే పరిస్థితి వస్తుందని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరించారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలన్నీ ఏకమై దేశంలో జరుగుతున్న ఈ ప్రైవేటీకరణలను వ్యతిరేకించాలని ఆయన పిలుపు ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిరసన ఉద్యమంలో భాగంగా ఈ నెల 26న కమ్యూనిస్టు పార్టీలు భారత్ బంద్ కు పిలుపు ఇచ్చాయి. ఈ బంద్ కు సహకరించాలని ఉండవల్లిని కలిసి విన్నవించారు కమ్యూనిస్టు నేతలు.
అనంతరం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఉండవల్లి.. స్టీల్ ప్లాంట్ కు మద్దతుతుగా జరుగుతున్న బంద్ కు తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, భారత దేశంలో కమ్యూనిస్టులు లేకుంటే.. పేదల సమస్యల గురించి మాట్లాడే రాజకీయ పార్టీలు కనుమరుగై పోతాయన్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండడంతోనే కమ్యూనిస్టులను వ్యతిరేకించాల్సి వచ్చేదని, అయితే తాను కమ్యూనిస్టు సిద్ధాంతాలకు వ్యతిరేకమే అయినా.. వారి నిబద్ధతను ఎప్పుడూ ప్రశంసిస్తూ ఉంటానని ఉండవల్లి చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ పాలనలో దేశంలో ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేస్తున్నారని మండిపడ్డారు.
2004 మార్చి 31 నాటికి భారత దేశం అప్పు 46 లక్షల కోట్ల రూపాయలుంటే, ప్రధాని మోదీ దాన్ని 2020 డిసెంబర్ నాటికి 1 కోటి 7 లక్షల కోట్ల రూపాయల అప్పుకు పెంచారని విమర్శించారు. మన రాజ్యాంగంలో సోషలిస్ట్ అనే పదం ఉండగా.. ప్రభుత్వ రంగ సంస్థలను ఎలా ప్రైవేటీకరణ చేస్తారని ఉండవల్లి ప్రశ్నించారు. దీనిపై కమ్యూనిస్టు పార్టీలు గట్టిగా పోరాడాలని ఉండవల్లి తెలిపారు.