
కావలసిన పదార్థాలు: 1 గంట నానబెట్టిన పెసరపప్పు – 2 టేబుల్ స్పూన్లు, పండిన టమాటా – 1 మీడియం సైజు, నీళ్లు – 2 కప్పులు, తాజా అల్లం – 2 అంగుళాల ముక్క, జీలకర్ర – అర టీస్పూన్, రాళ్ల ఉప్పు – రుచికి సరిపడా, వంట నూనె – 1½ నుండి 2 టేబుల్ స్పూన్లు, తుంచిన ఎండుమిరపకాయలు – 2, ఆవాలు – అర టీస్పూన్, తాజా కరివేపాకు – 1 రెమ్మ, ఇంగువ పొడి – పావు టీస్పూన్ కంటే తక్కువ, తాజా కొత్తిమీర తరుగు – గుప్పెడు, నల్ల మిరియాల పొడి – 1 నుండి 1½ టీస్పూన్, నిమ్మకాయలు – 3 మీడియం సైజు.

తయారీ విధానం: ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పును శుభ్రంగా కడిగి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. పాన్‌లోకి నానిన పెసరపప్పు, పైభాగంలో గాట్లు పెట్టిన 1 పండిన టమాటా, 2 కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి మీడియం మంటపై పప్పు మెత్తగా ఉడికే వరకు ఉడికించాలి. ఉడికిన తర్వాత టమాటాపై ఉన్న తొక్కను తొలగించి.. పప్పుగుత్తితో పప్పు మెత్తగా, టమాటా ముక్కలు అక్కడక్కడ తగిలేలా కచ్చాపచ్చాగా మెదిపి పక్కన ఉంచుకోవాలి.

రోట్లో 2 అంగుళాల అల్లం ముక్క, కొద్దిగా రాళ్ల ఉప్పు, అర టీస్పూన్ జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా దంచి సిద్ధంగా పెట్టుకోవాలి. స్టవ్‌పై చారు గిన్నె పెట్టి 1½ నుండి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత 2 తుంచిన ఎండుమిర్చి, అర టీస్పూన్ ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ఇందులోకి దంచి పెట్టుకున్న అల్లం-జీలకర్ర ముద్ద వేసి ఘాటు తగ్గకుండా కేవలం ఒక్క నిమిషం మాత్రమే వేయించాలి. ఆ తర్వాత కరివేపాకు రెమ్మ, కొద్దిగా ఇంగువ వేసి వేగిన వెంటనే.. మెదిపి పెట్టుకున్న పప్పు-టమాటా మిశ్రమాన్ని పోసి హై ఫ్లేమ్‌పై ఒక పొంగు రానివ్వాలి.

పప్పు మిశ్రమం ఒక పొంగు వచ్చిన తర్వాత అందులో 750 మి.లీ. (3 కప్పులు) నీళ్లు, గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసి హై ఫ్లేమ్‌పై బాగా తెర్లేలా మరిగించాలి. చారు మరుగుతున్నప్పుడు ఉప్పు సరిచూసి అవసరమైతే సర్దుబాటు చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పచ్చి అల్లాన్ని గ్రేటర్‌తో సన్నగా తురిమి నేరుగా చారులో వేయాలి. ఆ తర్వాత 1 నుండి 1½ టీస్పూన్ నల్ల మిరియాల పొడి వేసి కలిపి, ఒక్క పొంగు రాగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చారు మరగడం ఆగిపోయాక.. 3 నిమ్మకాయల రసాన్ని పోసి గరిటెతో బాగా కలపాలి. పులుపు సరిచూసుకుని అవసరమైతే మరికొంత నిమ్మరసం కలుపుకోవచ్చు. అంతే, నోరూరించే శీతాకాలపు స్పెషల్ 'వేడివేడి నిమ్మకాయ మిరియాల చారు' సిద్ధం! వేడివేడి అన్నంలో నెయ్యి వేసి కలిపి ఈ రసం పోసుకుని తిన్నా లేదా సాయంత్రం వేళ సూప్‌లా వేడివేడిగా తాగినా.. మిరియాలు, అల్లం ఘాటుతో గొంతుకు ఎంతో హాయినిస్తూ శరీరానికి నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది!