
రాత్రి ఆకలి అయినప్పుడు ఫ్రిజ్‌లో గనుక బేకరీ స్వీట్లు, ఐస్‌క్రీమ్‌లు లేదా కూల్‌డ్రింక్స్ ఉంటే మన వెయిట్ లాస్ ప్లాన్ అక్కడితో అటకెక్కినట్లే. అందుకే ఆకలి వేసినప్పుడు జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా బరువు తగ్గడానికి సహాయపడే 4 సూపర్ ఫుడ్స్ ఎప్పుడూ మీ ఫ్రిజ్‌లో ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

గుడ్లు: బరువు తగ్గించే డైట్‌లో ప్రోటీన్ చాలా ముఖ్యం. గుడ్ల ద్వారా శరీరానికి నాణ్యమైన ప్రోటీన్ అందుతుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదింపజేసి, ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. గుడ్లను ముందే ఉడకబెట్టి ఫ్రిజ్‌లో ఉంచుకోండి. అర్ధరాత్రి ఆకలి వేస్తే వెంటనే రెండు గుడ్డు తెల్లసొనలను తినేయొచ్చు.

పెరుగు: అనవసరమైన తీపి పదార్థాలు తినాలనే కోరికను అణచడానికి పెరుగు అద్భుతంగా పనిచేస్తుంది. పెరుగులోని ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను, జీవక్రియను వేగవంతం చేస్తాయి. ఇది పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆకలిగా అనిపించినప్పుడు పెరుగులో కొద్దిగా దోసకాయ లేదా క్యారెట్ ముక్కలు కలుపుకుని తింటే కడుపు నిండుతుంది, కేలరీలు కూడా పెరగవు.

కరకరలాడే కూరగాయలు: దోసకాయ, క్యారెట్, బ్రోకలీ, టమాటా, క్యాబేజీ, పాలకూర వంటివి ఎల్లప్పుడూ ఫ్రిజ్‌లో ఉండాలి. వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉండి, ఫైబర్ , నీటి శాతం ఎక్కువగా ఉంటాయి. ఇవి మలబద్ధకాన్ని నివారించడమే కాకుండా బరువు పెరగనివ్వవు. కూరగాయలను ముందే కడిగి, సలాడ్ ముక్కలుగా కోసి బాక్సుల్లో పెట్టుకోండి. భోజనానికి ముందు ఒక గిన్నెడు సలాడ్ తింటే.. మెయిన్ ఫుడ్ ఎక్కువగా తినకుండా కంట్రోల్ చేయవచ్చు.

పనీర్ హెల్తీ నైట్ స్నాక్: ఫ్రిజ్‌లో ఉంచుకోవడానికి పనీర్ మరో గొప్ప ఎంపిక. ఇందులో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా, ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు. రాత్రిపూట ఆకలి వేస్తే.. కొన్ని పనీర్ ముక్కలను పెనంపై తేలికగా వేయించి, కొంచెం మిరియాల పొడి చల్లుకుని తింటే అద్భుతమైన, ఆరోగ్యకరమైన స్నాక్ సిద్ధం.