
చైతన్యం ఉంటే చెత్తతోనూ చరిత్ర సృష్టించవచ్చనడానికి ఆ పార్క్ ఓ చక్కటి ఉదాహరణ.. వ్యర్థాలకు అర్థం తెలిపే ప్రయత్నం.. విద్యార్థులకు సందేశం. ఆ పార్కులో కనిపించే ప్రతి అద్భుతం ప్లాస్టిక్ వ్యర్థమే అక్కడ ఔరా అనిపించే ప్రతీ కళాఖండం ఒక సందేశమే.. పర్యావరణ పరిరక్షణకు చక్కటి సందేశం ఇస్తూ ప్లాస్టిక్ వ్యర్థాలతో అబ్బురపరిచే పార్క్ నిర్మాణం చేపట్టారు. ప్లాస్టిక్ పునర్వినియోగం ప్రత్యేకతను చాటుతున్న వేస్ట్ టూ బెస్ట్ ప్లాస్టిక్ పార్క్ పై ప్రత్యేక కథనం

చెత్తను సరైనచోట వేస్తే శుభ్రత పెరుగుతుంది.సృజనాత్మకతతో వాడితే సంపద పెరుగుతుంది. చెట్టు నాటితే నీడ.. ప్లాస్టిక్ తగ్గిస్తే ప్రాణ వాయువు. అదే ఈ పార్క్ సందేశం. వరంగల్ లో ప్లాస్టిక్ వ్యర్థాలతో రూపుదిద్దిన ఈ అద్భుతమైన కళాఖండాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కాలుష్యానికి కారణం అవుతున్న ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ డబ్బాలు, టైర్లు ఇతర వ్యర్థ పదార్థాలకు సృజనాత్మకతకు రూపం ఇచ్చి ఈ పార్కు నిర్మాణాన్ని చేపట్టారు

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ముందు నిర్మించిన ఈ వినూత్న పార్క్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. దాదాపు అర ఎకరం స్థలంలో పార్క్ నిర్మాణం చేపట్టారు.ఈ పార్కులో కనిపించే ప్రతి కళాఖండం ప్లాస్టిక్ వ్యర్ధాలతో తయారు చేసినవే. ఇక్కడ సుమారు 128 రకాల కళాకృతులు తయారుచేసి వాటికి రంగులు అద్దారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మెడికల్ అండ్ హెల్త్ టీం తో పాటు ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఈ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.. వనితా వనం, ప్లాస్టిక్ వ్యర్థాలతో పార్క్ నిర్మాణం చేపట్టారు.

ఇక్కడ జంతుజాతుల ఆకృతులు, పశు పక్షాదులు నమూనాలు, ప్లాస్టిక్ పూల తోరణాలు, టైర్లతో నిర్మించిన చేద బావులు, అలంకార శిల్పాలు, పారిశుద్ధ్య కార్మికుల నమూనా, వాటర్ బాటిల్స్ తో గుర్రపు రథం ఇలా అనేక రకాల ఆకృతులు కనిపిస్తాయి. ఈ పార్కు నిర్మాణంలో నిరుపయోగంగా చెత్త కుప్పలో పడేసే రెండు వేలకు పైగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉపయోగించారు. ప్లాస్టిక్ పైప్స్, ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ క్యాన్స్, ప్లాస్టిక్ షీట్స్, టైర్స్, సఫాయి వెహికల్ బ్రెష్, ప్లాస్టిక్ డ్రమ్స్, ప్లాస్టిక్ ఆయిల్ క్యాన్స్, డ్యామేజ్ ప్లాస్టిక్ చైర్స్, మొద్దులు, స్వచ్ఛ సైకిల్స్, లైవ్ ట్రీస్, సింక్ కాలమ్స్ ఇలా చెత్తకుప్పలో పారేసే ప్లాస్టిక్ వ్యర్ధాలన్నీ సేకరించి ఇలాంటి అద్భుతమైన కళాఖండాలతో పార్క్ నిర్మాణం చేపట్టారు.

వరంగల్ నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరిని ఈ ప్లాస్టిక్ వ్యర్ధాల పార్క్ హౌరా అనిపిస్తుంది. స్కూల్ విద్యార్థులకు చక్కటి సందేశాన్ని అందిస్తుంది. ఇక్కడ ఉపయోగించిన ప్రతి ప్లాస్టిక్ GWMC శానిటేషన్ సిబ్బంది చెత్తకుప్ప నుండి సేకరించినవే. చూడగానే మనసు దోచుకుంటున్న ఈ ప్లాస్టిక్ వ్యర్ధాల పార్కును ప్రతి ఒక్కరు ఆసక్తిగా తిలకిస్తున్నారు.పిల్లలకు చక్కటి సందేశాన్ని అందిస్తుంది అంటున్నారు.