
కానీ,ఈ మండుతున్న ఎండలతో పోరాడేందుకు విజయవాడ నగరం ఓ కొత్త ఆయుధాన్ని రంగంలోకి దించింది. అదే మిస్ట్ వెహికిల్స్ చూడటానికి ఇవి సాధారణ వాహనాల్లా కనిపించినా,పని మాత్రం అసాధారణం. అచ్చం యుద్ధరంగంలోకి దూసుకెళ్లే యంత్రాల్లా ఇవి రోడ్లపైకి వచ్చి సూర్యుడి తాపాన్ని తగ్గించేందుకు ఓ యుద్ధాన్ని ప్రారంభించాయి. నగరంలోని ప్రధాన రహదారులపై తిరుగుతూ ఈ వాహనాలు గాలిలోకి అతి సూక్ష్మమైన నీటి బిందువులను చిమ్ముతాయి. ఈ చిన్న చిన్న నీటి కణాలు గాలిలోని వేడిని వెంటనే గ్రహించి ఆవిరైపోతాయి. దాంతో చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత ఒక్కసారిగా కొద్దిగా పడిపోతుంది.

ఎండలో ప్రయాణించే వాహనదారులకు, పాద చారులకు ఇది ఒక చిన్న రిలీఫ్, కానీ చాలా విలువైన ఉపశమనం. ఒక్కసారి నీటితో నింపితే దాదాపు 6 వేల లీటర్ల సామర్థ్యంతో ఈ వాహనాలు సుమారు 18 కిలోమీటర్ల వరకు చల్లదనాన్ని పంచగలవు. సాధారణంగా వాడే నీటి ట్యాంకర్లతో పోలిస్తే ఇవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. నీటిని వృథా కాకుండా దాదాపు 90 శాతం వరకు ఆదా చేస్తూ, అవసరమైన చోటే ఉపయోగపడేలా డిజైన్ చేశారు. ఇంతటితో ఆగిపోలేదు,ఈ మిస్ట్ వెహికిల్స్ మరో ముఖ్యమైన పని కూడా చేస్తున్నాయి. గాలిలో తేలియాడే కాలుష్య కణాలను తగ్గించడం. ముఖ్యంగా ఆరోగ్యానికి హానికరమైన PM 2.5, PM 10 వంటి సూక్ష్మ కణాలను నియంత్రించడం ద్వారా నగర గాలి నాణ్యతను మెరుగుపరుస్తున్నాయి.

ఎండల కారణంగా రోడ్లు విపరీతంగా వేడెక్కి హీట్ ఐలాండ్ ప్రభావం కనిపించే నగరాల్లో ఈ తరహా టెక్నాలజీ చాలా అవసరం. ఈ వాహనాల్లోని హై ప్రెషర్ పంపులు నీటిని సూక్ష్మ బిందువులుగా మార్చి గాలిలోకి పంపడం వల్ల అవి వేడిని గ్రహించి వెంటనే ఆవిరైపోతాయి.

ఫలితంగా పరిసరాల్లో 3 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉంటుంది. అదే సమయంలో రోడ్డు డివైడర్లలో ఉన్న మొక్కలకు కూడా ఇవి ప్రాణం పోస్తున్నాయి. సాధారణంగా పోసే నీటితో పోలిస్తే,ఈ మిస్ట్ వల్ల ఆకులపై పేరుకుపోయిన ధూళి తొలగిపోతోంది. దీంతో మొక్కలు సజీవంగా ఉండి, కిరణ జన్య సంయోగం సరిగా జరగడానికి సహకరిస్తోంది.

విజయవాడ నగర పాలక సంస్థ 15వ ఆర్థిక సంఘం నిధులతో ఈ మిస్ట్ వెహికిల్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ప్రధాన రోడ్లపై వీటిని నడిపిస్తూ ప్రజలకు ఉపశమనం కల్పిస్తున్నారు. ఈ చర్యపై నగరవాసుల నుంచి మంచి స్పందన వస్తోంది. మొత్తానికి,మండుతున్న ఎండల మధ్యలో ఒక చల్లని ప్రయత్నంగా ఈ మిస్ట్ వెహికిల్స్ నిలుస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని వాహనాలను ప్రవేశపెట్టి, నగరంలోని అంతర్గత రహదారుల వరకు ఈ సేవలను విస్తరించాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.