
ఉలవలు అనగానే వాటిని పశువులకు దానగా పెడతారని, కొన్ని ప్రాంతాల్లో ఉలవచారు తయారు చేస్తారని మాత్రమే చాలా మంది అనుకుంటారు. కానీ వాస్తవానికి ఉలవలు పోషకాలు పుష్కలంగా ఉండే ఒక అద్భుతమైన సూపర్‌ఫుడ్.. ఉలవల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. ఉలవలు తినడం వల్ల ఒంట్లో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. రక్తహీనత రక్తహీనతతో బాధపడేవారు ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఉలవల్ని తింటే రక్తం పెరుగుతుంది.

ఉలవల్లో సాల్యుబుల్ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఈ గింజలను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.. ఇవి ఆకలిని పెంచడమే కాకుండా, అధిక బరువును నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. అంతేకాకుండా, వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల రక్తపోటు, రక్తంలో చక్కెర వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. అంతేకాకుండా.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా ఉలవలు లైంగిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.

ఉలవలను కొత్త బియ్యంతో సమానంగా తీసుకుని జావ చేసుకుని తాగితే శరీరానికి అవసరమైన కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఇది ఎముకలకు, కండరాలకు తక్షణ శక్తిని అందిస్తుంది. అలానే, ఉలవలకు యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉండటం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. ఈ గింజల్లోని ఫెనోలిక్ సమ్మేళనాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. ఇవి యాంటీ లిథోజెనిక్‌గా పనిచేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ఉలవల్లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి వాటితో పాటు B1, B2, B6, C విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. దీనివల్ల మాంసాహారానికి సమానంగా ప్రోటీన్లు కూడా శరీరానికి అందుతాయి. రక్తహీనతతో, ఎముకల బలహీనతతో బాధపడే మహిళలు, చిన్నారులు రోజూ ఉలవల సూప్ తాగితే ఈ సమస్యలు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా, శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి మెరుగ్గా పనిచేస్తుంది.

ఉలవలను (Horse Gram) చాట్లు, వడలు వంటి ఎన్నో రకాల వంటకాలను చేసుకోవచ్చు. అలాగే.. నానబెట్టి లేదా ఉడికించి, మొలకలుగా, చారుగా, లేదా పొడి రూపంలో తీసుకోవడం ఉత్తమం. ఇంకా రాత్రంతా నానబెట్టిన ఉలవలను ఉదయం పరగడుపున తినడం లేదా ఉలవచారు, గుగ్గిళ్లుగా చేసుకోవడం మంచిదని పేర్కొంటున్నారు డైటీషియన్లు...