
ప్రాచీన నమ్మకాల ప్రకారం.. తులసి మొక్కను శ్రీమహావిష్ణువుకు ప్రియమైన లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఆధ్యాత్మిక స్వచ్ఛత, ఆరోగ్యం, సానుకూలత విషయానికి వస్తే తులసికి మొదటి స్థానం దక్కుతుంది. వాస్తు ప్రకారం.. తులసి పరిసరాల్లోని ప్రతికూల శక్తిని, దిష్టిని గ్రహించి, దానిని ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. మీ ఇంటి ప్రధాన ద్వారం తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉంటే, అక్కడ తులసి మొక్కను ఉంచడం అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది.

మరోవైపు వాస్తు శాస్త్రంలో.. మనీ ప్లాంట్‌ను సంపదను, ఆర్థిక అవకాశాలను ఆకర్షించే మొక్కగా భావిస్తారు. ఇది ప్రవేశ ద్వారం వద్ద వాతావరణాన్ని శుద్ధి చేయడంతో పాటు కుటుంబంలో ఆర్థిక సమతుల్యతను కాపాడటానికి సహాయపడుతుంది. అయితే మనీ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ సరైన దిశలో, సరైన రీతిలో ఉంచడం చాలా ముఖ్యం. దీని ఆకులు నేలను తాకకుండా, నిరంతరం పైకి పెరిగేలా చూడటం ఆర్థిక వృద్ధికి, పురోగతికి సంకేతంగా చెప్తారు.

తులసి, మనీ ప్లాంట్ రెండింటికీ వాస్తులో ప్రత్యేక స్థానం ఉన్నప్పటికీ, వాటిని ఉంచే ప్రదేశంలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. తులసిని ప్రధాన ద్వారం బయట, సూర్యరశ్మి తగిలే శుభ్రమైన ప్రదేశంలో ఉంచవచ్చు. కానీ మనీ ప్లాంట్‌ను ఆరుబయట కాకుండా ప్రవేశ ద్వారానికి లోపలి వైపు లేదా ఆగ్నేయ మూలలో ఉంచడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ద్వారం బయట నేరుగా ఉంచడానికి తులసి అత్యంత శ్రేష్ఠమైన ఎంపికగా నిలుస్తుంది.

ఒకవేళ మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్థలం పరిమితంగా ఉండి.. కేవలం ఒకే మొక్కను మాత్రమే ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తే.. వాస్తు శాస్త్రం ప్రకారం తులసికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. తులసి ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపడమే కాకుండా ఆరోగ్య రక్షణను, లక్ష్మీదేవి కటాక్షాన్ని అందిస్తుంది. మనీ ప్లాంట్‌ను ఆ తర్వాత స్థానంలో ఇంటి ప్రవేశ ద్వారం లోపలి భాగంలో అందమైన అలంకరణగా, సంపద సూచికగా ఏర్పాటు చేసుకోవడం మంచిది.

ఇంటి ప్రధాన ద్వారం వద్ద తులసిని బయటి భాగంలోనూ, మనీ ప్లాంట్‌ను లోపలి భాగంలోనూ సరైన దిశల్లో ఉంచుకోవడం ద్వారా సంతోషం, శాంతి,సంపద మూడూ మీ సొంతమవుతాయి. అయితే కారణం ఏదైనా ప్రధాన ద్వారం దగ్గర ఎండిపోయిన మొక్కలను లేదా ముళ్ల మొక్కలను ఎప్పుడూ ఉంచకూడదని గుర్తుంచుకోండి. ఇటువంటివి ప్రతికూల శక్తిని పెంచి వాస్తు దోషాలకు దారితీస్తాయి కాబట్టి ప్రవేశ ద్వారాన్ని ఎల్లప్పుడూ పచ్చని మొక్కలతో, పరిశుభ్రంగా ఉంచుకోవడం మంచిది.