
కావలసిన పదార్థాలు: తాజా గోంగూర ఆకులు, పల్లీలు 4 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర అర టేబుల్ స్పూన్, నూనె 5 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 10, గట్టి టమాటాలు 5, ఉప్పు రుచికి సరిపడా, వెల్లుల్లి రెబ్బలు తగినన్ని, ఉల్లిపాయ 1, మెంతులు పావు టేబుల్ స్పూన్, తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, ఇంగువ చిటికెడు, కరివేపాకు 4 రెమ్మలు.

ముందుగా తాజా గోంగూర ఆకులను ముదురు కాడలు లేకుండా వలిచి, నీటితో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి దోరగా వేయించాలి. పల్లీలు సగం వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర వేసి చిటపటలాడే వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.

అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి, తుంచిన పది పచ్చిమిర్చి వేసి బాగా వేయించి పక్కకు తీసుకోవాలి. తర్వాత అదే నూనెలో తరిగిన ఐదు గట్టి ఎర్రటి టమాటా ముక్కలు వేసి మెత్తని గుజ్జులా మగ్గేంత వరకు వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. అనంతరం కడాయిలో మరో టేబుల్ స్పూన్ నూనె వేసి, శుభ్రం చేసిన గోంగూర ఆకులను వేసి మూతపెట్టి మగ్గించాలి. ఆకులోని నీరంతా ఇంకిపోయి దగ్గరపడే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత రోట్లో వేయించిన పల్లీలు, ధనియాలు, జీలకర్ర వేసి మెత్తగా దంచాలి. ఆ తర్వాత వేయించిన పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా నూరుకోవాలి. ఇప్పుడు వేయించిన గోంగూర, టమాటా గుజ్జు వేసి బాగా కలిసేలా రుబ్బాలి. చివరగా రెండు ముక్కలుగా కోసిన ఒక ఉల్లిపాయ వేసి కచ్చాపచ్చాగా దంచితే ఆ ఉల్లిపాయ రసం పచ్చడిలో కలిసి అద్భుతమైన రుచిని ఇస్తుంది.

అనంతరం స్టవ్ మీద కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి మెంతులు, తాలింపు గింజలు, దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. తాలింపు వేగాక రుబ్బుకున్న గోంగూర పచ్చడిని వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ గోంగూర పచ్చడి కలుపుకుని తింటే ఆ రుచి జన్మలో మర్చిపోలేరు.