
Starlink India: ఎలోన్ మస్క్ ఉపగ్రహ ఇంటర్నెట్ కంపెనీ, స్టార్ లింక్ త్వరలో భారతదేశంలో తన సేవను ప్రారంభించనుంది. కంపెనీకి అవసరమైన అన్ని అనుమతులు దాదాపు లభించాయి. అలాగే ఈ సేవ జనవరి లేదా ఫిబ్రవరి 2026లో ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు. భారతదేశంలో దాని ధర, వేగం, కనెక్షన్ గురించి వివరాల గురించి తెలుసుకుందాం.

భారతదేశంలో ప్రారంభించటానికి స్టార్‌లింక్ దాదాపు అన్ని అవసరమైన ప్రభుత్వ అనుమతులను పొందింది. ప్రస్తుతం, కంపెనీ SATCOM ఆమోదం, స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం వేచి ఉంది. నివేదికల ప్రకారం.. ఈ రెండు ప్రక్రియలు 2025 చివరి నాటికి పూర్తవుతాయని భావిస్తున్నారు. స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవను దేశంలో జనవరి లేదా ఫిబ్రవరి 2026లో ప్రారంభించవచ్చు.

భారత ప్రభుత్వం స్టార్‌లింక్ కనెక్షన్‌లపై పరిమితిని విధించింది. మార్గదర్శకాల ప్రకారం.. దేశంలో గరిష్టంగా 2 మిలియన్ కనెక్షన్‌లను అందించడానికి స్టార్‌లింక్ అనుమతి ఇస్తుంది. దీని అర్థం ప్రారంభ దశలో కంపెనీ గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చి పరిమిత సంఖ్యలో వినియోగదారులకు తన సేవను అందించగలదు.

భారతదేశంలో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీస్ కోసం, వినియోగదారులు ఒకేసారి సెటప్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది దాదాపు రూ.30,000 లేదా కొంచెం ఎక్కువ కావచ్చు. అదనంగా నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ధరలు రూ.3,300 నుండి ప్రారంభమవుతాయి. ఈ ధర సాంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ సేవల కంటే ఎక్కువ. కానీ మారుమూల ప్రాంతాలలో ఇది ఏకైక హై-స్పీడ్ ఎంపికగా మారవచ్చు.

స్టార్‌లింక్ భారతదేశంలో 25 Mbps నుండి 225 Mbps వరకు ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుందని పేర్కొంది. ఎంట్రీ-లెవల్ ప్లాన్ 25 Mbps వేగాన్ని అందిస్తుంది. అయితే ప్రీమియం లేదా హై-ఎండ్ ప్లాన్ 225 Mbps వరకు వేగాన్ని అందిస్తుంది.

సాంప్రదాయ నెట్‌వర్క్‌లు అందుబాటులో లేని ప్రాంతాల కోసం ఈ సేవ ప్రత్యేకంగా రూపొదించారు. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే ఈ వేగం మధ్యస్థంగా పరిగణించబడినప్పటికీ మారుమూల ప్రాంతాలకు ఇవి గణనీయమైన ఉపశమనం లభించనుంది.