
కావలసిన పదార్థాలు: 2 మీడియం సైజు - క్యూబ్స్‌గా తరిగిన బంగాళాదుంపలు, పావు కప్పు బీట్రూట్ క్యూబ్స్, ⅓ కప్పు క్యారెట్ క్యూబ్స్, పావు కప్పు తాజా బఠాణీ, 3 టమాటాలు ⅓ కప్పు క్యాప్సికమ్ తరుగు, 1 కప్పు క్యాబేజీ తురుము, 1 పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగినది, 3 పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి తరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, 5 నుండి 6 టేబుల్ స్పూన్ల వెన్న, 4 టేబుల్ స్పూన్ల వంట నూనె, అర టీస్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ చైనీస్ చిల్లీ పేస్ట్, 1½ టేబుల్ స్పూన్ల షెజ్వాన్ చట్నీ, ½ టీస్పూన్ల కాశ్మీరీ కారం పొడి, 1 టీస్పూన్ డార్క్ సోయా సాస్, 2 టీస్పూన్ల పావ్ భాజీ మసాలా, 2 టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్, 1 టీస్పూన్ ఆరోమాట్ పౌడర్ లేదా అజినమోటో(ఆప్షనల్), పావు కప్పు స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు, 1 నిమ్మకాయ రసం, రుచికి సరిపడా ఉప్పు, 3 నుండి 3½ కప్పులు నీళ్లు, లదీ పావ్ బన్స్ – అవసరమైనన్ని

తయారీ విధానం: కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడిచేసి, అర టీస్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఇందులో బంగాళాదుంప, బీట్రూట్, క్యారెట్, పచ్చి బఠాణీ, 1 టమాటా ముక్కలు, కొద్దిగా ఉప్పు, 1 టీస్పూన్ కారం వేసి 2-3 నిమిషాలు వేపాలి. ఆ తర్వాత 3 నుండి 3½ కప్పుల వేడి నీళ్లు పోసి కుక్కర్ మూతపెట్టి మీడియం మంటపై 4-5 విజిల్స్ రానిచ్చి ఉడికించాలి. ప్రెషర్ పోయాక మూత తీసి కూరగాయలను కచ్చాపచ్చాగా తేలికగా మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి.

వెడల్పాటి పాన్‌లో 3 టేబుల్ స్పూన్ల వెన్న, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడిచేయాలి. సిజిల్ అవుతున్న వెన్నలో 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి తరుగు వేసి 30 సెకన్లు వేయించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ తరుగు వేసి ఉల్లిపాయ పింక్ రంగులోకి మారే వరకు వేపాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఆపై క్యాప్సికమ్ తరుగు, 1 కప్పు సన్నని క్యాబేజీ తురుము, 2 టమాటాల తరుగు వేసి క్యాబేజీ పచ్చివాసన పోయేలా 4-5 నిమిషాలు బాగా వేపాలి.

క్యాబేజీ మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ చైనీస్ చిల్లీ పేస్ట్, 1½ టీస్పూన్ల కాశ్మీరీ కారం, 1½ టేబుల్ స్పూన్ల షెజ్వాన్ చట్నీ, 1 టీస్పూన్ డార్క్ సోయా సాస్ వేసి 2-3 నిమిషాలు వేపాలి. ఆ తర్వాత 2 టీస్పూన్ల పావ్ భాజీ మసాలా, 2 టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్, 1 టీస్పూన్ ఆరోమాట్ పౌడర్ వేసి నూనె తేలేలా కలపాలి.

ఇప్పుడు కుక్కర్లో ఉడికించి ఉంచుకున్న కూరగాయల మిశ్రమాన్ని నీటితో సహా పాన్‌లో పోయాలి. మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి పొటాటో మాషర్‌తో నిరంతరం కలుపుతూ 12 నిమిషాల పాటు కూరగాయలన్నీ కరిగిపోయేలా బాగా మాష్ చేయాలి. మధ్యలో భాజీ చిక్కబడితే 100 మి.లీ నీళ్లు పోసుకుంటూ మాష్ చేసుకోవాలి. చివరగా 2 టేబుల్ స్పూన్ల వెన్న, పావు కప్పు స్ప్రింగ్ ఆనియన్స్, 1 నిమ్మకాయ రసం పిండి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.

పెనంపై 1 టేబుల్ స్పూన్ వెన్న వేసి కరిగించి.. చిటికెడు పావ్ భాజీ మసాలా, కొత్తిమీర తరుగు చల్లి సిజిల్ అవ్వనివ్వాలి. లదీ పావ్‌ను మధ్యకు చీల్చి లోపలి వైపు, బయటి వైపులా వెన్నను అద్దుతూ రెండు వైపులా ఎర్రగా, క్రిస్పీగా కాల్చుకోవాలి. అంతే, నోరూరించే స్ట్రీట్ స్టైల్ 'చైనీస్ పావ్ భాజీ' సిద్ధం! వేడివేడి భాజీపై వెన్న క్యూబ్ వేసి, నిమ్మచెక్క, ఉల్లిపాయ ముక్కలు, క్రిస్పీ లదీ పావ్‌తో ముంచుకుని తింటుంటే సరికొత్త ఫ్యూజన్ రుచితో పరవశింపజేస్తుంది !