
బ్రష్ చేసిన వెంటనే నోరు కడగొద్దు: ఇది వినడానికి వింతగా ఉన్నా పచ్చి నిజం. మనం వాడే టూత్‌పేస్ట్‌లో ఫ్లోరైడ్ అనే ముఖ్యమైన పదార్థం ఉంటుంది. ఇది దంతాల మీద ఒక రక్షణ పొరను ఏర్పరచి పుచ్చు పళ్ల నుండి కాపాడుతుంది. బ్రష్ చేసిన వెంటనే నీటితో నోరు శుభ్రం చేసుకుంటే, ఆ ఫ్లోరైడ్ దంతాలకు అంటుకోకముందే కొట్టుకుపోతుంది. అందుకే బ్రష్ చేశాక కేవలం పేస్ట్‌ను ఉమ్మేసి, కనీసం 15-20 నిమిషాల వరకు నీటితో నోరు కడగకుండా ఉంటేనే పూర్తి ప్రయోజనం లభిస్తుంది.

తిన్న వెంటనే బ్రష్ చేస్తున్నారా: తిన్న వెంటనే నోరు శుభ్రంగా ఉండాలని బ్రష్ పట్టుకుంటున్నారా? అయితే మీరు మీ పళ్లను మీరే నాశనం చేసుకుంటున్నారు. మనం ఆహారం తీసుకున్నప్పుడు అందులోని ఆమ్లాలు దంతాల పైన ఉండే ఎనామెల్ పొరను తాత్కాలికంగా మృదువుగా చేస్తాయి. ఆ సమయంలో బ్రష్ చేస్తే, బ్రష్‌లోని బ్రిజిల్స్ ఆ మెత్తటి ఎనామెల్‌ను గీసేస్తాయి. దీనివల్ల పళ్ళు త్వరగా అరిగిపోతాయి. భోజనం చేసిన కనీసం 30 నుండి 60 నిమిషాల తర్వాతే బ్రష్ చేయడం ఉత్తమం.

మౌత్ వాష్‌లతో జాగ్రత్త: నోటి దుర్వాసన పోవాలని యాంటీ బాక్టీరియల్ మౌత్ వాష్‌లను వాడటం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. కానీ ఇవి నోటిలోని చెడు బ్యాక్టీరియాతో పాటు జీర్ణక్రియకు సహాయపడే మంచి బ్యాక్టీరియాను కూడా చంపేస్తాయి. నోటిలోని ఈ బ్యాక్టీరియా నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తికి అవసరం. ఇవి లేకపోతే రక్తపోటు పెరిగే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

తెల్లటి పళ్ల కోసం ఆరాటం వద్దు: ముత్యాల్లా మెరిసిపోవాలని పళ్లను తెల్లగా చేసే రసాయనాలను వాడటం వల్ల దంతాల సహజ రక్షణ పొర శాశ్వతంగా దెబ్బతింటుంది. గుర్తుంచుకోండి.. ఎనామెల్ అనేది ఒకసారి పోతే తిరిగి పెరగదు. ఈ రసాయనాలు పళ్లను సెన్సిటివ్‌గా మార్చేస్తాయి.

దంతాల ఆరోగ్యం కేవలం బ్రష్ చేయడంలోనే లేదు.. అది ఎలా చేస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. పళ్లు తోముకున్నాక నీటితో నోరు కడగకుండా ఉండటం, తిన్న వెంటనే బ్రష్ చేయకపోవడం వంటి చిన్న మార్పులు మీ దంతాలను నిండు నూరేళ్లు పదిలంగా ఉంచుతాయి.