
క్రికెట్‌లో జాతీయ జట్టుకు ఎంపిక కావడం ప్రతి ఆటగాడి కల. దేశవాళీ క్రికెట్‌లో ప్రతిభ చూపించి జాతీయ జట్టు స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్న తర్వాత.. అంతర్జాతీయ మ్యాచ్‌లో అరంగేట్రం చేయడం ఆటగాడి కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన ఘట్టం. అయితే కొందరు క్రికెటర్లకు ఈ అవకాశం మాత్రం దక్కలేదు. జాతీయ జట్టుకు ఎంపికైనప్పటికీ తుది జట్టులో చోటు లేకపోవడంతో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండానే కెరీర్ ముగించిన ఆటగాళ్లు ఉన్నారు.

సునీల్ వాల్సన్.. భారత క్రికెట్‌లో ఈ జాబితాలో సునీల్ వాల్సన్ పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. 1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో ఆయన సభ్యుడిగా ఉన్నారు. అయితే టోర్నీలో భారత్ ఆడిన ఒక్క మ్యాచ్‌లోనూ వాల్సన్‌కు తుది జట్టులో అవకాశం రాలేదు. ఆ తర్వాత కూడా భారత జట్టుకు ఆడే అవకాశం దక్కలేదు. దీంతో అంతర్జాతీయ మ్యాచ్ ఆడకుండానే ప్రపంచకప్ విజేతగా నిలిచిన అరుదైన భారత క్రికెటర్‌గా ఆయన గుర్తింపు పొందారు.

రాజిందర్ గోయల్.. దేశవాళీ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన ఎడమచేతి స్పిన్నర్లలో రాజిందర్ గోయల్ ఒకరు. రంజీ ట్రోఫీలో 750కి పైగా వికెట్లు తీసిన ఆయనను 1974-75లో వెస్టిండీస్‌తో సిరీస్ కోసం భారత జట్టుకు ఎంపిక చేశారు. అయితే జట్టులో బిషన్ సింగ్ బేడీ వంటి దిగ్గజ స్పిన్నర్ ఉండటంతో తుది జట్టులో అవకాశం దక్కలేదు. దీంతో అంతర్జాతీయ అరంగేట్రం లేకుండానే ఆయన కెరీర్ ముగిసింది.

జేమీ కాక్స్‌కు కూడా నిరాశే.. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో జేమీ కాక్స్ అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా నిలిచారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో భారీగా పరుగులు చేసినప్పటికీ, 1990లలో ఆస్ట్రేలియా జట్టులో తీవ్ర పోటీ కారణంగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. ఆ కాలంలో స్టీవ్ వా, మార్క్ వా, రికీ పాంటింగ్ వంటి దిగ్గజాలతో కూడిన జట్టులో చోటు కోసం పోటీ తీవ్రంగా ఉండేది.

ఇశ్వర్ పాండే.. భారత ఫాస్ట్ బౌలర్ ఇశ్వర్ పాండే కూడా జాతీయ జట్టుకు ఎంపికైనప్పటికీ అంతర్జాతీయ అరంగేట్రం చేయలేకపోయారు. 2014లో న్యూజిలాండ్ సిరీస్‌కు భారత జట్టులో చోటు దక్కినా తుది జట్టులో అవకాశం రాలేదు. అనంతరం 2022లో అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.